1957 జనవరి 23,24 తేదీలలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కాశ్మీర్ సమస్య మీద మాట్లాడుతూ భారత దౌత్యవేత్త వీ. కే. కృష్ణ మీనన్ తన ఎనిమిది గంటల ఏకధాటి ఉపన్యాసంలో పాకిస్తాన్ వాదనను తిప్పికొట్టడమే కాకుండా సోవియట్ యూనియన్ మద్దతు కూడగట్టాడు.
నెహ్రూకి నమ్మినబంటు
కేరళలో 1896లో జన్మించిన వెంగళి కృష్ణ కురుప్పు కృష్ణ మీనన్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని నెహ్రూకి నమ్మినబంటుగా గుర్తింపు పొందాడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటికి దేశంలో నెహ్రూ తర్వాత అంతటి శక్తివంతమైన రాజకీయ నాయకుడు అనిపించుకున్నాడు. భారత రాజ్యాంగం పీఠిక తొలిప్రతి సిద్ధం చేయడమే కాకుండా, అలీనోద్యమం పేరుతో సహా, విధివిధానాలు కూడా కృష్ణ మీనన్ రూపొందించాడు.
1957 నుంచి 1962 వరకూ భారత రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన మీనన్ వివిధ సందర్భాల్లో మహారాష్ట్రలో బొంబాయి నుంచి, పశ్చిమ బెంగాల్ లో మిడ్నపూర్ నుంచి, కేరళలో తిరువంతపురం నుంచి లోక్సభకు ఎన్నికయ్యాడు. 1952 నుంచి 1962 వరకూ ఐక్యరాజ్యసమితిలో భారత దేశం తరఫున రాయబారిగా ఉన్నాడు.
భద్రతామండలిలో కాశ్మీర్ సమస్య
కాశ్మీర్ సమస్యను భారతదేశం ఐక్యరాజ్యసమితి వద్దకు తీసుకుపోయాక అనేకసార్లు ఈ సమస్యమీద మండలిలో చర్చలు జరిగాయి. ఆ పరంపరలో భాగంగా 122వ తీర్మానం మీద 1957 జనవరి 23న జరిగిన చర్చలో మాట్లాడుతూ భారత ప్రతినిధిగా ఉన్న కృష్ణ మీనన్ ఏకధాటిగా అయిదు గంటల సేపు మాట్లాడి పాకిస్తాన్ వాదనను చీల్చి చెండాడాడు. ఈ సుదీర్ఘ ఉపన్యాసంలో ఎలాంటి నోట్సూ, పత్రాలూ చూడకుండా భారత దేశం తరఫున వాదనను బలంగా వినిపించాడు. నాలుగు గంటలు మాట్లాడిన తర్వాత కృష్ణ మీనన్ కళ్ళు తిరగి పడిపోవడంతో ఆసుపత్రికి వెళ్లి ప్రధమచికిత్స అనంతరం తిరిగివచ్చి మరో గంట మాట్లాడాడు. ఈ గంటసేపు ఒక వైద్యుడు మీనన్ పక్కనే ఉండి మధ్యమధ్యలో మీనన్ రక్తపోటు పరిశీలిస్తూ ఉన్నాడు.
అయిదు గంటల సుదీర్ఘ ఉపన్యాసం తర్వాత భద్రతా మండలి పనివేళలు ముగియడంతో పక్కరోజు తిరిగివచ్చి మరో రెండు గంటల నలభె ఎనిమిది నిమిషాలు మాట్లాడి తన ఉపన్యాసం ముగించాడు మీనన్. ఆ విధంగా మొత్తం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల మీనన్ ఉపన్యాసం ఈరోజుకీ ఐక్యరాజ్యసమితిలో అతి సుదీర్ఘ ఉపన్యాసంగా రికార్డు పుస్తకాలలో ఉంది. మీనన్ ఉపన్యాసం తర్వాత సోవియట్ యూనియన్ భారతదేశానికి తన మద్దతు తెలిపింది. అప్పట్లో పాకిస్తాన్ వైపు అమెరికా నిలవగా భారతదేశానికి సోవియట్ మద్దతు లభించడంతో భద్రతామండలిలో పాకిస్తాన్ ఆటలు సాగకుండా పోయాయి.
1971 వరకూ లోక్సభ సభ్యుడుగా ఉన్న మీనన్ 1974లో మరణించాడు. “ఒక అగ్నిపర్వతం ఆరిపోయింది” అని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మీనన్ మరణం గురించి వ్యాఖ్యానించారు.