తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ థియేటర్లు తెరుచుకోని పరిస్థితుల్లో ప్రేక్షకులకు కొత్త సినిమాల కోసం ఓటిటి తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. గత ఆరు నెలల్లో చిన్నా పెద్దా కలిపి చెప్పుకోదగ్గ స్థాయిలోనే చిత్రాలు వచ్చాయి కానీ ఏదీ అద్భుతంగా ఉందనిపించుకోలేదు. ఇలాంటి పరిస్థితిలో వచ్చిన కలర్ ఫోటో మీద ఎవరికీ భారీ అంచనాలు లేవు. అయినా యూనిట్ చేసిన ప్రమోషన్ వల్ల అంతో ఇంతో దీని మీద జనానికి ఆసక్తి కలిగింది. డిజిటల్ వరల్డ్ లో నెటిజన్లకు పరిచయమున్న సందీప్ రాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కొబ్బరిమట్ట నిర్మాత సాయి రాజేష్ కథను అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించిన కలర్ ఫోటో ఎలా ఉందో రివ్యూలో చూద్దాం
కథ
ఇది 1997లో జరిగే కథ. మచిలీపట్నంలో ఉండే జయకృష్ణ(సుహాస్)నల్లగా ఉన్నా మనిషి మంచోడు. పాల వ్యాపారం చేస్తూనే మరోవైపు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు. చూడగానే దీప్తి(చాందిని చౌదరి)ని చూసి మనసు పారేసుకుంటాడు. కానీ పైకి చెప్పడు. ఈలోగా ఓ అనూహ్య సంఘటన వల్ల తనతో పరిచయం మొదలువుతుంది. క్రమంగా అదే ప్రేమగా మారుతుంది. ఇది గుట్టుగా ఉంచినప్పటికీ అనుకోకుండా ఈ జంట దీప్తి అన్నయ్య రామరాజు(సునీల్)కంట పడుతుంది. పోలీస్ ఉద్యోగం చేసే అతనికి ప్రేమ వ్యవహారాలు గిట్టవు. చెల్లెలికి రామరాజుని దూరం చేసే ప్లాన్ లో సక్సెస్ అవుతాడు. ఆ తర్వాత వీళ్ళ జీవితాలు కీలక మలుపులు తిరుగుతాయి. అవెక్కడికి దారి తీస్తాయి, వీళ్ళ లవ్ స్టోరీ ఏ మజిలీకి చేరుకున్నది తెలియాలంటే సినిమా చూడాలి
నటీనటులు
ఇప్పటిదాకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నెట్టుకుంటూ వచ్చిన సుహాస్ ఇందులో హీరోగా తెరంగేట్రం చేశాడు. కథకు తగ్గట్టు నల్లగా ఉండే జయకృష్ణగా బాగానే ఒదిగిపోయాడు కానీ పాత్రలో ఉన్న బరువు ఇతని కెపాసిటీకి మించినది కావడంతో కొన్ని సందర్భాల్లో తడబడ్డాడు. వైవా హర్షతో కలిసి చేసే కామెడీ కూడా మరీ గొప్పగా ఏమి పండలేదు. అక్కడక్కడా సుహాస్ కంటే హర్షలోనే మంచి పెర్ఫార్మర్ కనిపిస్తాడంటే అతిశయోక్తి కాదు. సుహాస్ ఇంకా చాలా మెరుగు పడాల్సి ఉంది. ముఖ్యంగా ఎక్స్ ప్రెషన్స్ విషయంలో గట్టి హోమ్ వర్క్ చేయాలి. కమెడియన్లు హీరోలు కావడం కొత్తేమి కాదు కానీ అలీ తరహాలో సుహాస్ మొహంలో ఎలాంటి స్పార్క్ ఉండదు. ఆ బలహీనత దాటుకుని సినిమా మొత్తాన్ని భుజాల మీద మోయాలంటే చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది.
చాందిని చౌదరికి చూడదగ్గ రూపం, ఒద్దికైన నటన ఉంది కానీ తనలో కొన్ని మైనస్సులు ఉన్నాయి. హావభావాల పరంగా తను కూడా కొన్నిచోట్ల తేలిపోయింది. అయితే ఇది బడ్జెట్ సినిమా కావడం అందులోనూ సుహాస్ సరసన జోడి అంటే అంతోఇంతో నటనానుభవం ఉన్న చాందిని తప్ప ఇంకో ఆప్షన్ అంత ఈజీగా దొరకరు కాబట్టి ఆ కోణంలో చూసుకుంటే సంతృప్తి పడవచ్చు. మరీ బ్యాడ్ ఛాయస్ అయితే కాదు. ఇక సునీల్ కి నెగటివ్ షేడ్స్ ఉన్నందుకు అతనికి వెరైటీ అనిపించి ఉండవచ్చు కానీ క్యారెక్టర్ పరంగా ఎలాంటి ప్రత్యేకత లేదు. ఎన్నో సినిమాల్లో ఎందరో విలన్లు చేసిందే. డిస్కో రాజా తరహాలోనే ఇదీ ఏమంత ఎఫెక్ట్ ఇవ్వలేకపోయింది. వైవా హర్ష బాగా మెరుగవుతున్నాడు. తన ప్రత్యేకమైన డైలాగ్ టైమింగ్ ని ఇందులో కూడా చక్కగా వాడుకున్నాడు. క్లైమాక్స్ తర్వాత గుర్తుండిపోతాడు. దివ్యశ్రీపాద, కంచెరపాలెం రాజు, ప్రిన్సిపాల్ గా చేసిన సాయికృష్ణ ఎన్ రెడ్డి, విద్యా మహర్షి, ఆర్కె మల్లాది, స్నేహ మాధురి శర్మ తదితరులు వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు చేసుకుంటూ పోయారు
డైరెక్టర్ అండ్ టీమ్
దర్శకుడు సందీప్ రాజ్ తీసుకున్న కథలో నలుపబ్బాయి తెల్లమ్మాయి అనే థ్రెడ్ తప్ప మిగిలినదంతా రొటీన్ వ్యవహారమే. ప్రేమ కథలను పదే పదే కొత్తగా చూపించలేం నిజమే. అప్పుడెప్పుడో భారతీరాజా సీతాకోకచిలుక నుంచి తేజ జయం దాకా అన్నింటిలోనూ ఒకటే పాయింట్ ఉంటుంది. ఏమి లేని ఓ కుర్రాడు, పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయి మధ్య లవ్ స్టోరీలు ఇప్పటికే కోకొల్లలు వచ్చాయి. అయినా వాటికి ఆదరణ దక్కిందంటే కారణం సదరు డైరెక్టర్లు ఇచ్చిన ట్రీట్మెంట్. ముఖ్యంగా ఇలాంటి వాటిలో హీరో హీరోయిన్ మధ్య ప్రేమ పుట్టే ట్రాక్ ఎంగేజింగ్ గా, ఎంటర్ టైనింగ్ గా ఉండాలి. కానీ సందీప్ రాజ్ రిస్క్ ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ ఇక్కడ ఏ మాత్రం ఫ్రెష్ నెస్ లేకుండా తప్పు చేశాడు. ఎమోషనల్ గా డెప్త్ అనిపించే క్లైమాక్స్ ఉంటే చాలు ముందు జరిగేది ఎలా నడిచినా ప్రేక్షకుడు క్షమించేసి పాస్ చేస్తాడనుకోవడం పొరపాటు. కలర్ ఫోటోలో జరిగింది ఇదే.
ప్రేమకథలకు సహజమైన వాతావరణం ఒకటే చూపిస్తే సరిపోదు. అదే న్యాచురాలిటీ సన్నివేశాల్లో పాత్రల్లో కూడా ఉండాలి. కలర్ ఫోటో మొదలైన అరగంట వరకు అలాంటి ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ ముందుకు వెళ్లే కొద్దీ పంచరైన సైకిల్ టైర్ లా ఎగుడుదిగుడుగా సాగింది. పేపర్ మీద మనమో గొప్ప లవ్ స్టోరీ రాసుకున్నామని ఫీలైతే సరిపోదు. దానికి తెరమీదకెక్కేందుకు సరిపడా మెటీరియల్ ఉందో లేదో విజువలైజ్ చేసుకోవాలి. అలా జరగనప్పుడు అవుట్ ఫుట్ తేడాగానే వస్తుంది. జయకృష్ణ దీపుల మధ్య ఎమోషనల్ బాండింగ్ ని ఎస్టాబ్లిష్ చేయడంలో తడబడిన సందీప్ రాజ్ సంభాషణల పరంగా చమక్కులు మెరిపించినప్పటికీ అసలైన కథనం విషయంలో మాత్రం చేతులెత్తేశాడు.
సెకండ్ హాఫ్ లో ఎమోషన్ పేరిట అవసరానికి మించిన సాగతీత సహనానికి పరీక్ష పెడుతుంది. అసలు జయకృష్ణ, దీప్తి మధ్య ప్రేమే కన్విన్సింగ్ గా ఉండదు. కథను జయకృష్ణ కోణంలోనే చెప్పాలన్న దర్శకుడి ఆలోచన కాబోలు ప్రీ క్లైమాక్స్ కు ముందు దీప్తి నిజాయితీ మీద అనుమానం వచ్చేలా సాగుతాయి సన్నివేశాలు. వీళ్ళ ప్రేమను ఆవిష్కరించే క్రమంలో ఏర్పడ్డ కృత్రిమత్వం సినిమా చూసేవాళ్ళ భావోద్వేగాలను తగ్గించేసింది. అందుకే జయకృష్ణకు ఎంత కష్టం కలుగుతున్నా జాలి కలగదు. ఇదంతా స్క్రీన్ ప్లే లో జరిగిన తప్పిదాలే కానీ టేకింగ్ పరంగా రైటింగ్ విషయంలో సందీప్ రాజ్ తనలో విషయముందని మాత్రం ఋజువు చేసుకున్నాడు.
సంగీత దర్శకుడిగా కాల భైరవ పనితనం బాగుంది. రెండు పాటలు బాగున్నాయి. ఇటీవలి కాలంలో ఇతని వర్క్స్ చూస్తుంటే మంచి భవిష్యత్తు దక్కే అవకాశాలు ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనూ మెప్పించాడు. ఇలాగే కష్టపడితే తండ్రి కీరవాణి వారసత్వాన్ని కొనసాగించవచ్చు. కెమెరామెన్ వెంకట్ ఆర్ శాఖమూరి బడ్జెట్ పరిమితులను దృష్టిలో ఉంచుకుని చక్కని క్వాలిటీ తెరమీద కనిపించేలా మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. పవన్ కుమార్ ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉంటే నిడివి తగ్గి వేగం పెరిగేది. నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పడానికి లేదు. ఉన్నంతలో రిస్క్ తీసుకోకుండా తక్కువ బడ్జెట్ తో కానిచ్చేశారు. స్క్రిప్ట్ కూడా డిమాండ్ చేయలేదు లెండి.
ప్లస్ గా అనిపించేవి
సహజమైన లొకేషన్స్
సంగీతం
వైవా హర్ష
వెంకట్ ఛాయాగ్రహణం
మైనస్ గా తోచేవి
రొటీన్ కథా కథనాలు
అవసరానికి మించిన సాగతీత
వీక్ గా సాగే లవ్ ట్రాక్
క్లైమాక్స్
కంక్లూజన్
ప్రేమకథలు సుఖంతమైనా విషాదంతో ముగిసినా బలమైన కథాకథనాలు ఉన్నవాటిని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరించకుండా మానలేదు. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కలర్ ఫోటోను కూడా వాటి సరసన చేర్చేందుకు దర్శకుడు సందీప్ రాజ్ గట్టి ప్రయత్నమే చేశాడు. అయితే కాగితం మీద బలంగా రాసుకున్న ఎమోషన్ స్క్రీన్ పైకి వచ్చేప్పటికి వీక్ గా మారడంతో ఆడియన్స్ కి పూర్తిగా కనెక్ట్ కాలేక ఓ సగటు సినిమాగా మిగిలిపోయింది. ఓటిటిలో నేరుగా వస్తున్నవి థియేటర్లలో చూడకపోవడమే మంచిదయ్యిందనే సెంటిమెంట్ ని బలపరుస్తూ కలర్ ఫోటో కూడా ఇప్పటిదాకా వచ్చిన డిజిటల్ రిలీజుల ఫలితాన్నే అందుకునేలా ఉంది.
కలర్ ఫోటో – లైటింగ్ సరిపోలేదు