మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి విజయం సాధించింది. అయితే పార్టీలపరంగా చూస్తే బీజేపీ అత్యధిక స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. రాష్ట్రంలోని మొత్తం 106 నగర పంచాయతీలకు రెండు దశల్లో ఎన్నికలు జరగ్గా ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం అధికార మహావికాస్ అఘాడీ కూటమి 57 నగర పంచాయతీలను కైవసం చేసుకుంది. బీజేపీ 24 నగర పంచాయతీల్లో పాలకవర్గాలు ఏర్పాటు చేయనుంది. ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండటంతో డిసెంబర్ 21న ఓబీసీ రిజర్వేషన్లు లేని 11 నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. కోర్టు కేసు పరిష్కారం అయిన తర్వాత ఈ నెల 19 (బుధవారం)న మిగతా 95 నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
106 నగర పంచాయతీలు..1802 వార్డులు
రాష్ట్రంలోని సెమీ అర్బన్ ప్రాంతాల్లో 106 నగర పంచాయతీలు.. వాటి పరిధిలో 1802 వార్డు కౌన్సిలర్ పదవులకు ఎన్నికలు జరిగాయి. తాజా సమాచారం ప్రకారం మహావికాస్ అఘాడీ కూటమి 57 నగర పంచాయతీల్లో విజయం సాధించింది. వీటిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 25, కాంగ్రెస్ 18, శివసేన 14 చోట్ల పాలకవర్గాలు ఏర్పాటు చేయనున్నాయి. 1802 వార్డు కౌన్సిలర్ పదవుల్లో ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల్లో బీజేపీ అత్యధికంగా 390 సీట్లలో గెలుపొందింది. ఎన్సీపీ 369, కాంగ్రెస్ 305, శివసేన 297 వార్డులను చేజిక్కించుకున్నాయి. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి సత్తా చాటిందని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యానించారు. 26 నెలలుగా అధికారం చెలాయిస్తున్న మహావికాస్ అఘాడీ కూటమిని ధీటుగా ఎదుర్కొన్నామన్నారు.
ఓబీసీ రిజర్వేషన్ల వివాదంతో జాప్యం
స్థానిక సంస్థల్లో ఓబీసీ వర్గాలకు 27 శాతం సీట్లు కేటాయిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 21న ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న 2020 మార్చి నాటి సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం ఉల్లంఘించిదంటూ పలువురు పిటిషన్లు దాఖలు చేయడంతో వాటి అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. విచారణ అనంతరం ఓబీసీలకు కేటాయించిన 27 శాతం స్థానాలను జనరల్ కేటగిరీ గా మార్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఆ మేరకు మార్పులు చేసి ఎన్నికలు నిర్వహించారు.
Also Read : యూపీ ఎన్నికల్లో బికినీ గర్ల్ దుమారం