సీమ జిల్లాల్లో ఒకటైన అనంతపురం జిల్లాలో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఖనిజం ఉనికి లభించింది. జాతి రాత మార్చే విలక్షణ వనరుగా దీనిని చెప్పవచ్చు. ప్రపంచంలోనే అత్యంత అరుదుగా లభించే లిథియం ఖనిజ నిక్షేపాలు అనంతజిల్లాలో భారీగా ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సర్వేలో గుర్తించినట్టు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. లిథియం ప్రాజెక్టుపై వైసీపీ ఎంపీలు పార్లమెంటులో వేసిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి ప్రహ్లాద్ జోషి రాతపూర్వక సమాధానమిచ్చారు.
సీమలోని అనంతపురం సహా వైఎస్సార్ కడప జిల్లాలో కూడా ఈ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. జీఎస్ఐ శాస్త్రవేత్తలు కొన్ని నెలల క్రితం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మండలం తురక వారిపల్లె, దాడి తోట ప్రాంతాలతో పాటు సమీపంలోనే ఉన్న వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవరంలోని పార్నపల్లె, లోపటనూతల ప్రాంతాల్లో ఫీల్డ్ సర్వే చేశారు. ఈ ప్రాంతాల్లో మట్టి, కొన్ని అవశేపాలను సేకరించి పరీక్షించగా ఆ ప్రాంతంలో 18 పీపీఎం నుంచి 322 పార్ట్ పర్ మిలియన్ మోతాదులో లిథియం నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించినట్టుగా మంత్రి సమాధానం ఇచ్చారు.
అయితే ఈ లిథియం ఖనిజం చాలా అరుదుగా లభిస్తుంది. ఇప్పటివరకూ బొలీవియా, చిలీ, ఆస్ట్రేలియా, పోర్చుగల్ వంటి దేశాల్లో మాత్రమే దీని లభ్యత ఎక్కువ ఉంది. ఈ ఖనిజాన్ని రీచార్జ్బుల్ బ్యాటరీలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డిజిటల్ కెమెరాలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఎక్కువగా వాడుతూ ఉండడంతో దీనికి మంచి డిమాండ్ ఉంది. దీన్ని ప్రపంచ దేశాలన్నింటికీ కొన్ని దేశాలు మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ఇలాంటి ఖనిజం ఆంధ్ర ప్రదేశ్ లో దొరకడం అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే పునరుత్పాదక ఇంధన రంగంలో విండ్ టర్బైన్ల తయారీకీ లిథియం లాంటి అరుదైన లోహాలు కావాలి.
17 అరుదైన లోహాల్లో నియోడిమియం, లిథియం చాలా కీలకమైనవి. ఎలక్ట్రిక్ కార్లకు అమర్చే బ్యాటరీల తయారీకీ ఆధారమైన లిథియం నిక్షేపాలు అన్ని దేశాలు కంటే బొలీవియా దేశంలో పుష్కలంగా ఉన్నాయి. అయితే కరోనా తరువాత ఎలక్ట్రిక్ కార్లు, పునరుత్పాదక విద్యుదుత్పాదన సాధనాలు, స్మార్ట్ ఫోన్లు, రోబోలు తదితర డిజిటల్ సాధనాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు కనిపిస్తున్నాయి. అంతేకాక ఇక భవిష్యత్తు ఈ ఎలక్ట్రిక్ వాహనాలదే అని నిపుణులు అంచనా వేస్తున్న క్రమంలో ఏపీలో లభించే ఈ లిథియం ద్వారా ఆదాయానికి ఆదాయం, ఉపాధికి ఉపాధి కూడా లభించే అవకాశం ఉంది. అయితే వీటిని తవ్వి తీయడం కూడా ఎంతో వ్యయప్రయాసలతో కూడిన పని. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లనుందో వేచి చూడాలి మరి.