రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ క్రేజీ కాంబోలో రూపొందుతున్న లైగర్ విడుదల తేదీని సెప్టెంబర్ 9కి లాక్ చేశారు. నిన్నే దీనికి సంబంధించిన లీక్ వచ్చినప్పటికీ ఫైనల్ గా ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. భారీగా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న వాటిలో రిలీజ్ డేట్ పెండింగ్ ఉన్నది లైగర్ ఒక్కటే. ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోయింది. అనన్య పాండే హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమవుతున్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళంలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. వీటిలో హిందీ తెలుగు స్ట్రెయిట్ వెర్షన్లు గా యూనిట్ చెబుతోంది. మిగిలినవి డబ్బింగ్ రూపంలో వస్తాయి.
డేట్ ని ఎంచుకోవడంలో లైగర్ మంచి స్ట్రాటజీని ప్లే చేసింది. సెప్టెంబర్ లో ఏ సినిమా రిలీజ్ ప్రకటించలేదు. ఆ ఒక్క నెల పూర్తిగా ఖాళీగా ఉంది. హిందీ లైగర్ కి కరణ్ జోహార్ నిర్మాత కాబట్టి ఆ తేదీ పరిసరాల్లో ఇంకే పెద్ద సినిమా రాకుండా ప్లాన్ చేసుకుంటాడు. అసలు బాలీవుడ్ లో ఇంకా ఏ మూవీ రిలీజ్ డేట్ కనీసం అనౌన్స్ మెంట్ కూడా నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇలా ముందే చెప్పేసుకోవడం వల్ల ఎవరైనా అప్పటికి ప్లాన్ చేసుకున్నా మార్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే 9 పర్ఫెక్ట్ ఛాయస్ అని చెప్పొచ్చు. ఇంకో మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసేలా పూరి ప్లానింగ్ తో ఉన్నట్టు సమాచారం.
ఇప్పటికి కనిపించడం లేదు కానీ ఇంకో థ్రెట్ అయితే లైగర్ కు ఉంది. పవన్ కళ్యాణ్ రానా కాంబోలో రూపొందుతున్న అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ కూడా ఇంచుమించు అదే డేట్ కి ప్లాన్ చేసుకున్నట్టుగా గతంలోనే టాక్ వచ్చింది. ఒకవేళ మార్చినా ఓ వారం అటుఇటు అవుతుందే తప్ప ఖచ్చితంగా సెప్టెంబర్ లోనే వస్తుంది. ఎందుకంటే అక్టోబర్ లో ఆర్ఆర్ఆర్ ఉంది. ఆ నెల మొత్తం దానికే అంకితమయ్యేలా ఉంది. వీటి సంగతలా ఉంచితే లైగర్ రిలీజ్ పోస్టర్ లో నిర్మాతలందరి పేర్లు వేశారు కానీ సంగీత దర్శకుడు ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. నార్త్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండే అవకాశాలే ఎక్కువ.