నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమాన్ని మలుపు తిప్పి కేంద్రం దిగి వచ్చేందుకు ఒక కారణమైన లఖిమ్ పూర్ ఖేరీ దుర్ఘటన ప్లాన్ ప్రకారం జరిపిన దాడి అని ఆ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ధారించింది.
ఈ మేరకు స్థానిక చీఫ్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఒక నివేదిక దాఖలు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా సహా మొత్తం 14 మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని కోరింది. ఇంత వరకు దీన్ని ర్యాష్ డ్రైవింగ్ కారణంగా అనుకోకుండా జరిగిన దుర్ఘటన అన్న కోణంలో దర్యాప్తు చేసినట్లు సిట్ అధికారి విద్యారామ్ దివాకర్ వెల్లడించారు.
సెక్షన్లు మార్చి హత్యా యత్నం కేసులు..
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా యూపీలోని లఖిమ్ పూర్ ఖేరీలో రైతులు ప్రదర్శన నిర్వహిస్తున్న సమయంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు చెందిన కారు రైతులపైకి దూసుకుపోయింది. నలుగురు రైతులు అక్కడికక్కడే చనిపోయారు. దాంతో ఆగ్రహోదిక్తులైన రైతులు కారులో ఉన్న మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా ఇతర బీజేపీ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ప్రతిగా వాహనంలో ఉన్నవారు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ పరస్పర దాడుల్లో ఒక జర్నలిస్టు సహా నలుగురు మరణించారు. మొత్తంగా ఆ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. వాహనం దూసుకుపోయిన సమయంలో అందులో కేంద్ర మంత్రి కుమారుడు ఉన్నాడని.. వారు కావాలనే తమ పైకి వాహనాన్ని నడిపారని, కాల్పులు జరిపారని రైతులు ఆరోపించారు.
కానీ కేంద్ర మంత్రి, యూపీ ప్రభుత్వం ఈ వాదనలను తోసిపుచ్చాయి. పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ కేసుగా దీన్ని నమోదు చేశారు. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. స్వయంగా బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ వాహనం దూసుకుపోయిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టి.. అది కావాలని చేసిన ఘటన అని ఆరోపించడం, కోర్టులు కూడా దర్యాప్తు జరుగుతున్న తీరును తప్పుపట్టడంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను నియమించింది.
కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన సిట్ అధికారులు స్థానిక కోర్టులో ఒక నివేదిక దాఖలు చేశారు. రైతులపైకి వాహనం ర్యాష్ డ్రైవింగ్ వల్లో.. అనుకోకుండానో దూసుకుపోలేదని అందులో పేర్కొన్నారు. అది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని స్పష్టం చేశారు. అందువల్ల ఏ కేసులో మొదట నమోదు చేసిన ఐపీసీ 279, 338, 304ఏ సెక్షన్లు తొలగించి ఐపీసీ 307, 326, 34లను చేర్చేందుకు.. ఆ మేరకు హత్యాయత్నం కేసుగా దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని సిట్ అధికారులు కోర్టును కోరారు. దుర్ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ అసలు లేనని వాదిస్తున్న కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా ఇక హత్యాయత్నం కేసు ఎదుర్కోక తప్పదు.