దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖిమ్ పూర్ ఖేరి కాల్పుల కేసులో కేంద్రమంత్రి కుమారుడి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ విభాగం ఇచ్చిన నివేదిక ప్రధాన నిందితుడు ఆశీష్ మిశ్రాను టార్గెట్ చేసింది. ఈ ఘటనలో మిశ్రాతోపాటు మరో నిందితుడు అంకిత్ దాస్ వాడుతున్న తుపాకుల నుంచే కాల్పులు జరిగాయని ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించింది. దీంతో ఇంతకాలం సంఘటన జరిగిన సమయంలో తన కుమారుడు అసలు అక్కడ లేదని కేంద్రమంత్రి అజయ్ మిశ్రా చేస్తున్న వాదనలో వాస్తవం లేదని తేలిపోయింది. కేసు కొత్త మలుపు తిరిగింది.
ఆ రోజు ఏం జరిగింది?
కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండుతో ఏడాది కాలంగా రైతులు ఢిల్లీ, యూపీ ప్రాంతాల్లో ఉద్యమాలు చేస్తున్నారు. అక్టోబర్ మూడో తేదీన యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ చంద్ర మౌర్య లఖిమ్ పూర్ ఖేరి ప్రాంతంలో పర్యటనకు వెళ్లగా.. ఉద్యమంలో ఉన్న రైతులు ఆయన్ను అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఆ సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ మిశ్రా కుమారుడి కారు రైతుల సమూహం పైకి దూసుకుపోయింది. కారును అడ్డుకోవడానికి ప్రయత్నించిన రైతులపై కారులోంచే కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మృతి చెందారు. దాంతో ఆగ్రహించిన రైతులు జరిపిన ప్రతి దాడిలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక డ్రైవర్ మృతి చెందారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ దారుణ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి కుమారుడిని కాపాడేందుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. యూపీ ప్రభుత్వ వైఖరి, దర్యాప్తు జరుగుతున్న తీరుపై సుప్రీంకోర్టు కూడా గత రెండు విచారణలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
తన కుమారుడు అక్కడ లేడంటున్న కేంద్రమంత్రి
ఈ ఘటనలో ఉపయోగించిన కారు కేంద్రమంత్రి అజయ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాదని, ఆ సమయంలో కారులోనే ఉన్న ఆయనే కాల్పులకు తెగబడ్డాడని రైతులు ఆరోపించారు. అయితే కేంద్రమంత్రి తన కుమారుడిని వెనకేసుకొస్తూ భిన్న వాదనను తెరపైకి తెచ్చారు. రైతులపైకి దూసుకుపోయిన కారు తన కుమారుడిదేనని అంగీకరిస్తూనే.. అందులో అతను లేడని వాదిస్తున్నారు.అసలు సంఘటన స్థలంలోనే లేడని.. ఆ సమయంలో వేరే చోట వేరే కార్యక్రమంలో ఉన్నాడని చెప్పుకొచ్చారు. దాంతో నిజాల నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు అధికారులు ఆశీష్ తో పాటు మరో నిందితుడు అంకిత దాస్ కు చెందిన లైసెన్స్డ్ తుపాకులను గత నెల 15న ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. వాటిని పరీక్షించిన నిపుణులు వారి తుపాకుల నుంచే కాల్పులు జరిగాయని నిర్ధారించారు. ఆ మేరకు మంగళవారం నివేదిక సమర్పించారు. ఈ నివేదికతో కేసు మరో మలుపు తిరిగింది. ఇంతకాలం కేంద్రమంత్రి తప్పుడు వాదనలు వినిపించారని తేలిపోయింది. ఈ కేసులో ఇప్పటివరకు ప్రధాన నిందితుడు ఆశీష్ మిశ్రాతో సహా 13 మందిని అరెస్టు చేశారు. తాజా పరిణామం యూపీలోని బీజేపీ ప్రభుత్వాన్ని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది.
Also Read : BJP, Petrol Prices – కొనక్కొచ్చుకున్న బీజేపీ..!