భారీ ఉప్రదవం తెచ్చిన ముప్పు నుంచి మహా నగరం కోలుకోవడానికి చాలా సమయమే పడుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు తెలంగాణకు తెచ్చిన నష్టం అపారమైనది. సుమారు రూ.10 వేల కోట్ల వరకు నష్టం జరిగిందని శాఖల వారీగా గణాం కాలతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి వివరించింది. పంట నష్టం రూ.8,633 కోట్లు, రహదారులకు రూ. 222 కోట్లు, జీహెచ్ఎంసీకి రూ.567 కోట్లు నష్టం వాటిల్లిం దని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం వరద సహా యక చర్యలకు తక్షణంగా రూ.550 కోట్లు విడు దల చేసినట్లు పేర్కొంది. రాష్ట్రంలో మౌలిక వసతులకు భారీగా నష్టం వాటిల్లడంతో ఆ దిశగా ప్రాథమిక అంచనాను రూపొందించింది. ఇదంతా ఒక్క ఎత్తయితే ముంపు ప్రాంతాల్లో బాధితులను ఆదుకోవడానికి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తానే స్వయంగా వెళ్లి..
వరద సహాయక చర్యలకు తక్షణంగా రూ.550 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ముంపు ప్రాంతాల్లో నష్టపోయిన ప్రతి ఇంటికీ రూ.10 వేలు అందజేస్తోంది. రెండు రోజులుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్ చాలా ప్రాంతాల్లో తానే స్వయంగా ఇంటింటికీ వెళ్లి ఈ సహాయం అందిస్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా మంత్రి నామ్ కే వాస్తేగా ఏదో ఒకటి, రెండిళ్లకు వెళ్లి బాధితులను పరామర్శించడం మామూలే. కానీ ప్రస్తుతం కేటీఆర్ బస్తీల్లో దాదాపు అన్ని ఇళ్లనూ సందర్శిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. వరద నీటిలోనే ప్రతి ఇంటికీ వెళ్లడం బాధితులకు స్వయంగా 10 వేల రూపాయలు అందించడం, ప్రభుత్వం అన్ని విధాలా అదుకుంటుందని, త్వరలోనే ఇళ్లు దెబ్బతిన్నవారికి మరింత నష్ట పరిహారం అందిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇదిగో.. నేను వెళ్లిపోయినా మా మనిషి ఈయన. ఏం అవసరం వచ్చినా ఈయనను కలవండి. కచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేందుకు చూస్తారు.. అంటూ ప్రతి కాలనీ, బస్తీల్లో కొంత మందికి బాధ్యతలు అప్పగిస్తున్నారు.
ఇప్పుడిదే హాట్ టాపిక్..
కేటీఆర్ పని తీరు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో చర్చనీయాంశంగా మారింది. మున్ముందు గ్రేటర్ ఎన్నికలు ఉండడంతో వ్యూహాత్మకంగానే కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే.. పురపాలక శాఖ మంత్రి గా బాధితుల బాధ్యత తన భుజాలపై వేసుకుని సహాయం పంపిణీలో ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఎలాగున్నా.. ఆపద సమయంలో మంత్రి కేటీఆర్ నేరుగా బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించడం వల్ల వారికి కొంతైనా భరో్సా కలుగుతోంది. వారి సాధక బాధలు వింటూ ఆర్థిక సహాయం అందించడం ద్వారా బాధితులు కొంత ఊరట చెందుతున్నారు.