ఫిడే మహిళల స్పీడ్ చెస్ ఛాంపియన్షిప్ 4వ గ్రాండ్ ప్రీలో తన అద్భుత ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఫైనల్‌కు చేరిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి తుది పోరులో చేతులెత్తేసింది.
ఆదివారం జరిగిన ఫైనల్లో రష్యా గ్రాండ్ మాస్టర్ అలెగ్జాండ్రా కోస్తానుక్ (రష్యా) చేతిలో పరాజయం పాలైంది. ఫైనల్లో ఇరువురు క్రీడామణులు మొదటి గేమ్‌లలో నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి.కానీ ఆట కొనసాగే కొద్దీ తెలుగు గ్రాండ్ మాస్టర్ హంపిని ఒత్తిడిలోకి నెట్టిన కోస్తానుక్ మ్యాచ్‌పై పట్టు సాధించింది.దీంతో టైటిల్ పోరులో 7-5 తేడాతో ఓటమి చెందిన కోనేరు హంపి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.మూడో స్థానం కోసం జరిగిన మరో మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ హో ఇఫాన్ 7.5-2.5 తేడాతో ఖాదిమ్లాషెరీ (ఇరాన్)పై గెలిచింది.
కాగా స్పీడ్ చెస్ నాలుగు గ్రాండ్ ప్రీలు ముగిసేసరికి హంపి పది పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది.ఇక పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలను దక్కించుకున్న కోస్తానుక్ (24 పాయింట్లు),ఉక్రెయిన్ గ్రాండ్ మాస్టర్ అన్నా ఉషెనినా (22 పాయింట్లు) మధ్య సోమవారం స్పీడ్ చెస్ సూపర్ ఫైనల్ జరగనుంది.