ఆలులేదు చూలులేదు ఇలా అదేదో సామెత ఉందిగా.. అట్లనే కనుమరుగవుతున్న కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు ధైర్యం చెప్పి నడిపించేవారు లేరు. ఒకప్పుడు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ రాష్ట్రం ఏర్పాటు తరువాత దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేక చూస్తూ ఉండిపోయిన కాంగ్రెస్… నాయకులు అప్పుడే ముఖ్యమంత్రి ఎవరనే వ్యాఖ్యలు చేయడం కొంచెం హాస్యాస్పదమే. మొన్నటి వరకు పీసీసీ పదవి కోసం ప్రయత్నం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆపదవి దక్కకపోవడంతో మొదట్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పిసిసి ప్రకటించగానే నిరసన కూడా వ్యక్తం చేశారు. తర్వాత హైకమాండ్ రంగంలోకి దిగి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బుజ్జగించడంతో కూల్ అయ్యారు.
రేవంత్ రెడ్డికి దూరంగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పీసీసీ చీఫ్ పదవి దక్కక అసంతృప్తిలో ఉన్న కోమటిరెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని కూడా తేల్చేశారు. తుర్కపల్లి మండలం రాంపూర్ తండాలో జరిగిన దళిత, గిరిజన దండోరా దీక్షలో పాల్గొన్న ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని అన్నారు. దళిత బంధుతో ముఖ్యమంత్రి కేసీఆర్ తన బొంద తానే తవ్వుకున్నాడని, రాహుల్ బొజ్జా లాంటి అధికారిని సీఎంవోలోకి తీసుకోవడంతో దళితులు అందరికీ న్యాయం చేసినట్టు కాదని విమర్శించారు. తన నియోజకవర్గంలోని దళితుల అందరికీ పది లక్షలు ఇస్తే తాను కూడా రాజీనామా చేస్తానని తన స్థానంలో కవిత కు టిక్కెట్ ఇవ్వాలని ఆమెను తానే గెలిపిస్తారని ప్రకటించారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఏడుగురు రెడ్లు,నలుగురు వెలమల చోటు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క దళితుడికి చోటు ఇవ్వలేదు అని పేర్కొన్నారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలోనే భిన్నంగా స్పందిస్తున్నారు నాయకులు. అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ముందు క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం జరిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని అందుకు సీనియర్ నాయకులు అందరూ సమిష్టిగా కాంగ్రెస్ తరఫున పని చేయాలని సూచిస్తున్నారు. అందరూ కలిసి పని చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడు ముఖ్యమంత్రి విషయంలో హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుందని అప్పటివరకు ఈ విషయంలో ఎవరు సొంత అభిప్రాయాలు పార్టీ లైన్ దాటి బయట మాట్లాడకూడదని కొంతమంది కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
మరికొంతమంది నేతలు కోమటిరెడ్డికి పిసిసి చీఫ్ దక్కకపోవడంతో తానే ముఖ్యమంత్రి రేసులో తాను ఉన్నానని చెప్పడానికే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని దీనివల్ల పార్టీకి నష్టం తప్ప లాభం లేదని ముందు నుంచి ఒంటెత్తు పోకడలు పోతున్న కోమటిరెడ్డి బహిరంగ వ్యాఖ్యలు చేసే ముందు పార్టీని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని సూచిస్తున్నారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది గురిచేసేలా ఉన్నాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై పార్టీ వివరణ తీసుకోవాలని కోరుతున్నారు. లేకుంటే ఇతర నేతలు కూడా ఇలానే ముఖ్యమంత్రి రేసులో ఉన్నామని వ్యాఖ్యలు చేస్తారని ఇది పార్టీకి చాలా చెడ్డ పేరు తీసుకువస్తుందని సూచిస్తున్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య ఏదైనా విభేదాలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని వీరిద్దరి మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేకూర్చేలా ఉండకూడదని పార్టీ పెద్దలు హితవు పలుకుతున్నారు.