విజయవాడలో పారిశ్రామికవేత్త కోగంటి సత్యం మరోసారి సరికొత్త హత్యతో తెరపైకి వచ్చారు. ఒకప్పటి విజయవాడ పరిస్థితులు ఇప్పుడు లేవు. ముఖ్యంగా 1970-80 దశకం చూసిన ముఠా కక్షలు, హత్యలు ఇప్పుడు లేవు. రెండు మూడు దశాబ్దాలుగా విజయవాడ ప్రశాంత వాతావరణంలోనే ఉంటోంది. ఏవో చిన్న చిన్న గొడవలు తప్ప నగరం ప్రశాంతంగానే ఉంటోంది.
కానీ పారిశ్రామికవేత్తగా ఎదిగిన కోగంటి సత్యం మాత్రం అడపాదడపా వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా రియల్ ఎస్టేట్ వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో విజయవాడ పోలీసులు కోగంటి సత్యంను అరెస్ట్ చేసి రిమాండుకు పంపారు. ఈ వివాదంలో ఓ మహిళతో సహా మొత్తం 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివాదం కేవలం ఆర్ధికపరమైనది కావడం, ఇలాంటి వివాదాల్లో ప్రస్తుతం కోగంటి సత్యం క్రియాశీలకంగా ఉండడం ఇటీవల పోలీసులు గమనిస్తూనే ఉన్నారు.
Also Read:పవన్ కళ్యాణ్ కంటే బండి సంజయ్ బెటర్ అవుతున్నాడా …?
అయితే ఎంత పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగినప్పటికీ తొలినాళ్ళలో విజయవాడలో వడ్డీ వ్యాపారం చేసిన కోగంటి సత్యం ఆ వ్యాపారాన్ని కొనసాగిస్తూనే వడ్డీ వ్యాపారం చుట్టూ ఉండే ఆర్ధిక వివాదాల్లో తలదూర్చడం, పంచాయితీలు చేయడం, డబ్బులు ఇప్పించడం, కిడ్నాపులు చేయడం, బెదిరించడం, అవసరమైతే కొట్టడం వంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. అలాగే ఈ పంచాయితీల్లో తనవాటా అంటూ కొంత వసూలు చేయడం, ఆ వాటా నగదు రూపంలోనో, భూముల రూపంలోనో సాధించుకోవడం, అందుకోసం బలప్రయోగం చేయడం పరిపాటిగా వస్తోంది. ఈ క్రమంలో కొన్ని సార్లు అరెస్టు అవుతూ వస్తున్నారు.
మొత్తంగా ఇప్పటికి కోగంటి సత్యంపై 12 క్రిమినల్ కేసులు ఉన్నాయని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి శ్రీనివాసులు ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారి కరణం రాహుల్ హత్యకేసులో రిమాండులో ఉన్న కోగంటి సత్యం ఈ కేసులో కూడా రాహుల్ ను నిర్బంధించాడని, హింసించాడని, అంతిమంగా హత్యకు కారణం అయ్యాడని అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే రాహుల్ ను హత్య చేసేముందు అతన్ని నిర్బంధించి, హింసించి, కొన్ని కాగితాలపై సంతకాలు కూడా చేయించుకున్నారని ఆరోపణ ఉంది. అయితే కోగంటి సత్యం ఇలాంటి చర్యలను మొదటి నుండి అనుసరిస్తూనే ఉన్నారు.
Also Read : అనంతలక్ష్మి నాయకత్వం మాకొద్దంటున్న కాకినాడ తమ్ముళ్లు
తొలినాళ్ళలో కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతిపరుడిగా ఆ పార్టీ నేతల మద్దతుతో ఎడ్లబండ్లపై, రిక్షాలపై ఇసుక వ్యాపారం చేసిన కోగంటి సత్యం తనచుట్టూ ఎప్పుడూ ఇలా రోజువారీ కూలీలను ఉంచుకోవడం, వారితో చిన్నా చితకా పనులు చేయడం ఇప్పటికీ మార్చుకోలేదు. ఇప్పుడు ఇసుక వ్యాపారం లేకపోయినా ఈ రోజువారీ కూలీలు మాత్రం కొనసాగుతూనే ఉన్నారు. నిత్యం వారికీ కూలీ రూపంలోనో, లేక మద్యానికో ఎంతోకొంత పంచిపెట్టడం, అవసరాన్ని బట్టి వారిని తన పంచాయితీలకు వాడుకోవడం అలవాటయింది. ఈ క్రమంలో చాలామంది కూలిపని మానేసి కోగంటి సత్యం కు అండగా నిలవడం, అవసరాన్ని బట్టి ఆయన చెప్పిన వారిపై దౌర్జన్యం చేయడం, వారు కేసుల్లో ఇరుక్కుంటే వారిని విడిపించడం ప్రస్తుతం కోగంటి సత్యం చేస్తున్న పనులు.
అలాగే, 1990 దశకంలో ఇనుము వ్యాపారం చేపట్టి పారిశ్రామికవేత్తగా మారినా, తద్వారా సమాజంలో తన హోదా మారినా ఈ చిల్లర పనులు మాత్రం ఆయన మానుకోలేదు. పైగా ఈ చిల్లర పనులనే ఆయన రోజువారీ వ్యాపకంగా చేసుకున్నారు. అందుకే నగరంలో వడ్డీ వ్యాపారం చేసేవారు, చిట్ నిర్వహించేవారు ఏవైనా వివాదాలు వస్తే ముందుగా కోగంటి సత్యం దగ్గరకే వెళుతున్నారు. కొంతమంది వడ్డీ వ్యాపారులు, చిట్ నిర్వాహకులు కూడా నేరుగా కోగంటి సత్యంతోనే సంబంధాలు కొనసాగిస్తున్నారు.
ఇవన్నీ తెలిసినా పోలీసులు అప్పట్లో చూసీ చూడనట్టు వెళ్లారు . ఇలా అధికారుల మద్దతుతో పాటు కోగంటి సత్యం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సానుభూతిపరుడుగా తెరపైకి కనిపించడం, అధికారపార్టీ నేతలతో సమావేశాల్లో కూర్చోవడం, పార్టీ కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వడం, నేతలకు అనుచరులుగా తన చుట్టూ ఉండేవారిని పంపించడం వంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అందుకే కొంతమంది రాజకీయనాయకులకు కోగంటి సత్యం ఆప్తుడు. ఈ గుర్తింపే అప్పుడప్పుడు ఆయన నగరంలో హత్యలు, దౌర్జన్యాలు చేసేందుకు ఉపయోగపడుతున్నాయి.
Also Read : చంద్రబాబు ఐదేళ్ళు, జగన్ రెండేళ్లు: ఆర్థిక పరిస్థితిపై ఎందుకీ రాద్ధాంతం?