జేఏసీతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుని, కార్మికులు సమ్మె విరమించేలా చేయాలన్న హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో చర్చల పునరుద్ధరణపై తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. చర్చల ప్రసక్తే లేదని సీఎం కరాఖండిగా చెప్పిన విషయ తెలిసిందే. తాజాగా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించడంతో ఏం చేయాలన్న దానిపై సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ‘సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టీసీ నేతలతో ఇప్పటికే ముగ్గురు అధికారులతో కూడిన బృందం తొలి దఫా చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. ప్రధానంగా ఆర్టీసీ కార్మిక జేఏసీ, రాష్ట్ర ప్రభు త్వం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో చర్చల పునరుద్ధరణపై సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. చర్చలు జరపాల్సి వస్తే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆర్టీసీ ఎండీ పోస్టును సైతం తక్షణమే భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అందుకోసం సమర్థులైన అధికారిని నియమించేందుకు సమావేశంలో కసరత్తు చేశారు.