తెలుగువారి సత్తాని విశ్వ క్రీడల్లో చాటిన కరణం మల్లేశ్వరికి అనుకోని అవకాశం దక్కింది. ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తొలి క్రీడా యూనివర్సిటీకి ఆమె వైస్ ఛాన్సలర్ గా ఎంపికయ్యారు. దాంతో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం నుంచి ప్రస్తుతం హర్యానాలో శిక్షణాశిబిరం నిర్వహిస్తున్న కరణం మల్లేశ్వరికి ప్రత్యేక గుర్తింపు దక్కినట్టయ్యింది.
కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టర్ గా విశేష ఖ్యాతి గడించారు. ఆమె శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జూన్ 1, 1975లో జన్మించారు. చిన్ననాటి నుంచి అసమాన ప్రతిభతో ఒలింపిక్స్ వరకూ వెళ్లారు. 2000 సంవత్సరం సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ 69 కిలోల విభాగంలో కాంశ్య పతకం సాధించారు. వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్ పతకం సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలలో రెండు సార్లు బంగారు పతకాలు, ఆసియా క్రీడల్లో వెండి పతకాలు కూడా సాధించారు.
1997లో సహచర వెయిట్ లిఫ్టర్ రాజేష్ త్యాగిని ఆమె వివాహమాడారు. ఆ తర్వాత ఢిల్లీకి మకాం మార్చారు. హర్యానా పరిధిలో శిక్షణ కోసం అకాడమీ ఏర్పాటు చేశారు. స్పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో పలు క్యాంపులు కూడా నిర్వహించారు. భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చింది. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు కూడా ఆమె దక్కించుకున్నారు.
తాజాగా దేశంలోనే తొలిసారిగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం కరణం మల్లేశ్వరిని వీసీగా ఖరారు చేసింది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ప్రకటన చేశారు. ఒలింపిక్స్ లో పతకాలు సాధించే స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దడమే ఈ యూనివర్సిటీ లక్ష్యంగా ప్రకటించారు. చదువులతో సంబంధం లేకుండా క్రీడాకారులను తీర్చిదిద్దుతామన్నారు. దేశం గర్వించే స్థాయిలో ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.