కృష్ణమ్మ ఉగ్ర రూపానికి ఎప్పుడూ బాధితులుగా నిలిచే విజయవాడ కృష్ణ లంక లోని కుటుంబాలు అదనంగా ఈ ఏడాది పలువురు ప్రముఖులు కూడా చేరారు. ఈ ప్రకాశం బ్యారేజీకి ఎగువన కరకట్ట వెంబడి ఉండే ఈ ప్రముఖులు గతంలో ఇబ్బంది పడినా అది వెలుగు చూడలేదు. ఐతే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరకట్ట కింద ఉన్న లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్ లో నివాసం ఉండడం తో కృష్ణమ్మ బాధితుల జాబితాలో ప్రముఖుల బంగ్లాలు, గెస్ట్ హౌస లు ఉన్నట్లు ప్రపంచానికి తెలిసింది.
తెలియడం తో తలనొప్పి మొదలు..
2009 తర్వాత కృష్ణ నదికి పెద్దగా వరదలు రాలేదు. గత 5 ఏళ్లుగా ఐతే డెల్టా ఆయకట్టుకు కూడా సాగు నీరు అందలేదు. గోదావరి పై పట్టిసీమ ఎత్తిపోతలు పెట్టి పోలవరం కుడి కాలవ ద్వారా ప్రకాశం బ్యారేజి కి నీటిని తరలించారు. ముఖ్య మంత్రిగా దాదాపు 5 ఏళ్ళు పాటు కరకట్ట కింద చంద్రబాబు నివాసం ఉన్నా కరువు వాళ్ళ కృష్ణమ్మ తో ఇబ్బంది రాలేదు. కానీ ఈ ఏడాది కృష్ణమ్మ ఉగ్ర రూపం వల్ల మాజీ సీఎం చంద్రబాబు కుటుంభం ఇబ్బందులు పడింది. వరద వాళ్ళ చంద్రబాబు ఉంటున్న ఇల్లు ముంపునకు గురైంది. తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు ఆ ఇంటి నుంచి తాత్కాలికంగా బయటకు రావాల్సి వచ్చింది. చంద్రబాబు ఉంటున్న ఇల్లు మునగడం, ఆ విషయం బయటకు తెలియడం తో ఆయనతో పాటు కరకట్ట కింద నదిని అనికుని భవనాలు నిర్మించిన ప్రముఖులందరికీ తలనొప్పులు మొదలయ్యాయి. అంతకు ముందే 2017 లో కష్ణానది ఒడ్డున తాడేపల్లి మండలం, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని వివిధ సర్వే నెంబర్లలో పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపట్టారని, దీనిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకష్ణారెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసారు. ఐతే టిడిపి అధికారంలో ఉండడం తో ఈ విషయాన్నిఅప్పటి పాలకులు సాగతీసారు.
ప్రజా వేదిక తో మొదలు..
చంద్రబాబు నివాసానికి దగ్గరలో టీడీపి ప్రభుత్వం హయాంలో ప్రజా నిర్మించిన ప్రజా వేదిక నిబంధనలు విరుద్ధంగా, నది గర్భంలో ఉండడంతో జగన్ సర్కార్ దాని తొలగించింది. ఇక్కడే కథ మొదలైంది. ప్రజా వేదిక పక్కనే మాజీ సీఎం చంద్రబాబు నివాసం ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ కూడా నదిని అనికునే ఉంది. దాన్ని తొలగించాలని సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేయడం, ఈ లోపు కృష్ణ నదికి వరదలు రావడం తో తొలగింపు ప్రక్రియ ముందుకు సాగింది. ఈ వ్యవహారం సీఎం నివాసం ఉంటున్న గెస్ట్ హౌస్ పక్కన భవనాలకు చుట్టుకుంది. వాల్టా చట్టం ప్రకారం నది ప్రవాహ ప్రాంతానికి 500 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ.. ఆయా నిర్మాణాలు కూడా తొలగించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు.
హైకోర్టు లో సాగుతున్న విచారణ..
కష్ణానది ఒడ్డున వెలసిన అక్రమ నిర్మాణాల విషయంలో వివరణ ఇవ్వాలని హైకోర్టు శుక్రవారం ఆ నిర్మాణాల యజమానులను ఆదేశించింది. వారికి మరోసారి నోటీసులు జారీ చేస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంది. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్న యజమానులు, ప్రభుత్వాధికారులు తదుపరి విచారణకల్లా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేయడంతో కరకట్ట వెంబడి, నది గర్భంలో ఉన్న నిర్మాణాల తొలగింపు వ్యవహారం టివి సిరియల్ లా సాగుతోంది.