జనసేన అధినేతకు కొత్త సమస్యలు వస్తున్నాయి. ఆయనకు చేరువయిన నేతలంతా ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ముఖ్యంగా సొంత కులంలో గుర్తింపు ఉన్న వారే పవన్ ని భరించలేమంటూ రాజీనామాలు ఇచ్చి పోతున్నారు. కాపుల ఓట్లే ఆధారంగా భావించిన పవన్ కళ్యాణ్ కి భవిష్యత్తులో కష్టాలు తప్పవా అనే సందేహానికి ఈ పరిణామాలు దోహదపడుతున్నాయి. సొంత కులస్తులే అంతో ఇంతో అండగా ఉంటున్న తరుణంలో వారిలో విద్యావంతులు, మేథావులుగా గుర్తింపు ఉన్న వారు కూడా జారిపోతే జనసేన రెంటికీ చెడ్డ రేవడిలా మారిపోయే ప్రమాదం ఉంటుంది.
జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత పవన్ వెంట నడిచిన కీలక నేతలు, ఆ తర్వాత ఆయనకు తోడయిన నేతలు కూడా అర్థాంతరంగా కాడివదిలిపోతున్నారు. అందులో కొందరు పవన్ వ్యవహారశైలిని సహించలేక సెలవు చెప్పేస్తుంటే మరికొందరు నేతలు చంద్రబాబుతో స్నేహం కోసం పవన్ చేస్తున్న యత్నాలను జీర్ణించుకోలేకపోతున్నట్టు చెబుతుండడం విశేషం. ఇప్పటికే పార్టీ ప్రారంభ నాయకుల్లో కీలకమైన రాఘవయ్య వంటి నేతలు జనసేన కు బైబై చెప్పేశారు. పార్టీ ఆవిర్భావ సమయంలో కూడా కీలక బాధ్యతలు నిర్వహించిన రాఘవయ్య జనసేనను వీడిన తర్వాత ఆయన వెంట కొందరు నేతలు దూరమయిపోయారు.
Also Read : జస్టిస్ ఈశ్వరయ్యకు ఊరట : జడ్జి రామకృష్ణ అభియోగాలు ఉత్తువేనా..?
ఎన్నికలకు ముందే అద్దంకి శ్రీధర్ వంటి గుర్తింపు ఉన్న వాళ్లు పవన్ తీరు గిట్టక పార్టీ ఫిరాయించగా, ఆ తర్వాత కూడా పలువురు నేతలు పవన్ వైపు చూడడం మానేశారు. ఇక ఎన్నికల్లో పవన్ కి తోడుగా అంతా భావించిన విశాఖ ఎంపీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ కూడా ఫలితాలు రాగానే పవన్ కి దండం పెట్టేశారు. ఆపార్టీలో ఉండలేనంటూ చెప్పేశారు. ఆయనతో పాటుగా సీనియర్ ఎడిటర్, ఆర్టీఐ కమిషనర్ గా పనిచేసిన విజయ్ బాబు కూడా పవన్ వైఖరి మీద తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తూ జనసేనకు రాజీనామా చేశారు. తాజాగా మరో సీనియర్ నేత మాదాసు గంగాధరం కూడా పవన్ పక్క చూపులను సహించలేకపోతున్నానంటూ బైబై చెప్పేశారు.
ముఖ్యంగా పవన్ తన పార్టీలో కాపు నేతలను దూరం చేసుకుంటూ కమ్మ కులానికి చెందిన నాదెండ్ల మనోహర్ కి ప్రాధాన్యతనివ్వడమే ఇలాంటి పరిణామాలకు దారితీస్తుందని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మనోహర్ కి సొంతంగా తెనాలిలో కూడా పట్టు లేదన్న విషయం వరుసగా రెండు ఎన్నికల్లోనూ తేలిపోయింది. అదే సమయంలో ఆయన కన్నా బలమైన నేతలు, వివిధ నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చిన వారు కూడా ఉన్నప్పటికీ పవన్ మాత్రం పూర్తిగా నాదెండ్లకే ప్రాదాన్యతనివ్వడం వారంతా జీర్ణం చేసుకోలేకపోతున్నట్టు స్పష్టమవుతోంది ఈ పరిస్థితుల్లో పవన్ పట్ల కాపు యువతలో ఉన్న అంతో ఇంతో ఉన్న క్రేజ్ కూడా కోల్పోయే ముప్పు ఉందని పలువురు జనసేన నేతలే భావిస్తున్నారు. దాంతో పవన్ కి సొంత కులంలో మొదలవుతున్న సెగ రాజుకోకముందే కోలుకోవడం మంచిది.
Also Read : వైసీపీ గెలుపుకు మరో కొత్త కారణం చెబుతున్న చంద్రబాబు
17176