వరదల కారణంగా ఇసుక తీయడంలో ఇబ్బంది తలెత్తిందని, 260 రీచ్‌లకు గానూ కేవలం 60 రీచ్‌లలో మాత్రమే ఇసుక లభ్యమవుతోందని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. దీనివల్లనే ఇసుక డిమాండ్, సప్లై మధ్య కొంత అంతరం ఏర్పడిందన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, పవన్ కల్యాణ్‌కు ఇవేమీ పట్టడం లేదని.. కేవలం ఇసుకతో రాజకీయం చేయాలని మాత్రమే చూస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో సొంత పుత్రుడు లోకేశ్ దీక్ష చేస్తే.. వైజాగ్‌లో దత్తపుత్రుడు పవన్ దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కృత్రిమ పోరాటాలు చేయడం వారికే చెల్లిందని విమర్శించారు. నిజంగా పవన్ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఉంటే గత ఐదేళ్లుగా జరిగిన ఇసుక మాఫియాపై ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు.
కృత్రిమ పోరాటాలు…
రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా వర్షాలు పడుతున్నాయి. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయని కన్నబాబు ఆనందం వ్యక్తం చేశారు. కరువు సీమలో కూడా పచ్చని పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు. వరదల వల్ల ఇసుక కొరత ఏర్పడటంపై చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాన్‌కు సంతోషం గా ఉందని, అందుకే కృత్రిమ పోరాటాలు చేస్తున్నారని ఎద్దేవా చేసారు. నిజానికి వైజాగ్‌లో కొత్తగా పవన్ లాంగ్ మార్చ్ చేసేది ఏమిలేదని, గత ఐదేళ్లు చేస్తూనే ఉన్నారన్నారు. పవన్ దీక్షకు టీడీపీ నేతలు జన సమీకరణ చేస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయన్నారు.
అప్పుడు ఎక్కడకి పోయారు..?
చంద్రబాబు హయాంలో బొగ్గు గనుల్లో తవ్వినట్లు నదిలో అక్రమంగా ఇసుకను తవ్వారని ఆరోపించిన కన్నబాబు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు ప్రభుత్వానికి రూ. 100 కోట్లు జరిమానా విధించింన విషయం గుర్తు చేశారు. ఇసుక అక్రమాలపై వార్తలు రాసిన రిపోర్టర్లపై టీడీపీ నేతలు దాడి చేశార పేర్కొన్నారు. అక్రమ ఇసుకను అడ్డుకున్న మహిళలపై చంద్రబాబు లాఠీచార్జీ చేయించారని మండిపడ్డారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న వారిని లారీలతో తొక్కించి చంపించారని ఆరోపించారు. ఇన్ని ఘటనలు జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ మాట మాట్లాడకుండా ఎక్కడికి పోయారునై మంత్రి కన్నబాబు ప్రశ్నించారు.