గత ఏడాది కొద్దికాలం పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా పనిచేసిన జస్టిస్ వి కనగరాజు ఏపీలో మరోసారి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈసారి ఆయన పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్ హోదాలో నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. సుప్రీంకోర్టు, తెలంగాణా హైకోర్టులు గతంలో ఇచ్చిన తీర్పుల మేరకు పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఏర్పాటు చేయాలని గత ఏడాది ప్రభుత్వం నిర్ణయించింది.. దానికి అనుగుణంగా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అథారిటీ ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్ర అథారిటీకి సుప్రీంకోర్టు, హైకోర్టులో పనిచేసి రిటైర్డ్ జడ్జిలు, రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులను చైర్మన్ గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది దాంతో కనగరాజ్ కి అవకాశం దక్కింది.
చెన్నై హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ కనగరాజ్ కి మంచి గుర్తింపు ఉంది. ఆయన అనుభవాన్ని గౌరవిస్తూ ఏపీ ప్రభుత్వం తొలుత ఎన్నికల సంఘం అధికారిగా నియమించినప్పటికీ గతంలో కోర్టు తీర్పుల కారణంగా ఆయన వైదొలగాల్సి వచ్చింది. అనూహ్యంగా ఏపీలో ఎంట్రీ ఇచ్చిన ఆయన అతి త్వరలోనే తన పదవిని కోల్పోయారు. అయితే ప్రస్తుతం ఆయనకి దక్కిన పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్ హోదాలో మూడేళ్ల పాటు ఉంటారు. ఆయనతో పాటుగా అథారిటీ ఇతర సభ్యుల నియామకం జరుపుతామని ప్రభుత్వం తెలిపింది.
పోలీస్ శాఖలో వస్తున్న మార్పుల మూలంగా శాఖాపరమైన సమస్యలను ఈ అథారిటీ పరిశీలిస్తుంది. అధికారులు, సిబ్బంది మధ్య తలెత్తే సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంది. పోలీసు విభాగం పనితీరు మెరుగుపరిచే దిశలో నిర్ణయాలు సిఫార్సు చేస్తుంది. శాంతిభద్రతలను పరిరక్షించే విభాగంలో సిబ్బందికి సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుంది. కీలకమైన విభాగానికి క్యాబినెట్ హోదాలో కనగరాజ్ నియామకం ఆసక్తిగా మారింది. జడ్జిగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన సూచనలు పోలీసుల విభాగం మెరుగుపడేందుకు దోహదపడతాయని భావిస్తున్నారు.
Also Read : నారా లోకేష్.. స్వర్గీయ ఎన్టీఆర్‌లా ఉన్నారంట..!