బాలీవుడ్ నటి కంగనా రనౌత్ త్వరలో రాజకీయాల్లోకి వచ్చేయబోతోందట. గత కొద్ది రోజులుగా ఆమె ‘ప్రో బీజేపీ’ స్టాండ్ తీసుకున్న విషయం విదితమే. అయితే, బీజేపీ మాత్రం ఆమె విషయంలో ఆచి తూచి అడుగులేస్తోంది. ఇదిలా వుంటే, రియా చక్రవర్తి విషయంలోనూ, బాలీవుడ్లో డ్రగ్స్ కలకలం విషయంలోనూ, నెపోటిజం తదితర అంశాలపైనా ఇటీవల కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ముంబైలో ఆమెపై ‘దాడి’ జరిగే అవకాశం వుందంటూ ఇంటెలిజెన్స్ నివేదికలూ వచ్చాయట. ఈ క్రమంలోనే ఆమెకు ‘వై కేటగిరీ’ భద్రతని కేంద్రం కల్పించింది. దాంతో, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కంగనా రనౌత్ కృతజ్ఞతలు కూడా తెలపడం గమనార్హం. ఇదంతా చూస్తే, అతి త్వరలో కంగన బీజేపీలో చేరడం ఖాయమనే వాదనలకు బలం చేకూరుతోంది. అయితే, కంగన మాత్రం ఇంతవరకు తాను రాజకీయాల్లోకి వస్తానన్న విషయమై ఎక్కడా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ, ‘నాకు నరేంద్ర మోడీ అంటే చాలా ఇష్టం. బీజేపీ భావజాలాన్ని ఇష్టపడతాను..’ అని పలు సందర్భాల్లో చెప్పింది. కంగనకి వున్న క్రేజ్ నేపథ్యంలో ఆమెను బీజేపీలోకి లాగాలని కమలనాథులూ భావిస్తున్నారట. రాజకీయాల సంగతి పక్కన పెడితే, కంగన తన నోటి దురుసు కారణంగా బోల్డంత పాపులారిటీ సంపాదించింది. రాజకీయ నాయకులే ‘వై కేటగిరీ’ భత్రత కోసం నానా తంటాలూ పడతారు. అలాంటిది కంగనకి చాలా సులువుగా ఆ ఘనతతో కూడిన భద్రత దక్కేసింది.