మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలలో ఎన్నికల కమిషన్ కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చింది.డాబ్రా ఉప ఎన్నికల ప్రచార సభలో కమల్‌నాథ్ చేసిన “ఐటమ్” వ్యాఖ్యలు ఆయన కొంప ముంచాయి.
మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఉప ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పదేపదే ఉల్లంఘించినట్లు ఎన్నికల కమిషన్ నిర్ధారించింది. దీనితోపాటు ఆయనకి ఇచ్చిన సలహాను పూర్తిగా విస్మరించినందుకు కమల్‌నాథ్ యొక్క “స్టార్ క్యాంపెయినర్” హోదాను రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌కి చేటు తెచ్చిన కారణాలను పరిశీలిస్తే గత మార్చి చివరి వారం జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన ఇమార్తీ దేవి కాంగ్రెస్ పార్టీకి,శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్లో మంత్రి పదవి పట్టిన ఇమార్తీ దేవి ఉప ఎన్నికలలో తిరిగి గ్వాలియర్‌లోని డాబ్రా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో రెండు వారాల క్రితం డాబ్రాలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో మాజీ సీఎం కమల్‌నాథ్ ప్రసంగిస్తూ బీజేపీ అభ్యర్థి ‘ఐటమ్’ కంటే భిన్నమైన సాధారణ వ్యక్తి తమ కాంగ్రెస్ అభ్యర్థి అని ఇమార్తీ దేవిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహిళా మంత్రి,బీజేపీ అభ్యర్థి ఇమార్తీ దేవిపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి.
కాగా కమల్‌నాథ్ వ్యాఖ్యలపై బిజెపిఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది.ఇక ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రెండు గంటల పాటు మౌన దీక్ష చేశారు.అలానే కమల్‌నాథ్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి సీఎం శివరాజ్ సింగ్ లేఖ కూడా రాశారు. దళిత మహిళను కించపరచినందుకు కాంగ్రెస్ హైకమాండ్ క్షమాపణలు చెప్పాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కమల్‌నాథ్ ఐటమ్ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. మరోవైపు తాను ఎవరినీ అవమానించ లేదని తన చేతిలో ఉన్న జాబితాలో ఐటెం నెంబర్ వన్, టూ పేర్లు ఉన్నాయని వాటినే నేను చదివాను అని ఆయన వివరణ ఇచ్చారు.
ఇక మహిళా అభ్యర్థిపైనే గాక సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కూడా కమల్‌నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్న ఈసీ వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు వెల్లడించింది.స్టార్ క్యాంపెయినర్ హోదా కోల్పోవడంతో మాజీ సీఎం కమల్‌నాథ్ ఇప్పటి నుంచి ఏదైనా నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటే మొత్తం ఖర్చంతా ఆ అభ్యర్థినే భరించాల్సి ఉంటుంది. అలాగే కమల్‌నాథ్ ప్రచారం కోసం చేసే ప్రయాణం,బస,సందర్శనకు సంబంధించిన మొత్తం ఖర్చులు సదరు అభ్యర్థి ఎన్నికల ఖర్చు కింద ఎన్నికల సంఘం పరిగణించనుంది.
కాగా ఎలక్షన్ కమిషన్ చర్య రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న కాంగ్రెస్,ఈసీ చర్యకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించింది.