నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఎన్నికల్లో 99.64 శాతం పోలింగ్ నమోదు అయింది. మొత్తం 824 ఓట్లకుగాను 821 ఓట్లు పోలయ్యాయి. కోవిడ్ పాజిటివ్‌గా తేలిన 24 మందిలో 21 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో 19 మంది పీపీఈ కిట్లు ధరించి ఓటేయగా మిగతా ఇద్దరు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. ఉపఎన్నిక బరిలో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ పార్టీ నుంచి సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ ఎన్నికల బరిలో ఉన్నారు. బ్యాలెట్ పద్దతిలో ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ నిర్వహణను చేపట్టారు. ఎక్స్అఫీషియో సభ్యులు, ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటేశారు. ఈ నెల 12న నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ కు అధిక మెజార్టీ ఉండడంతో కవిత గెలుపు దాదాపు ఖాయమైనట్లే.
మంత్రివర్గంలో చేరతారా..?
కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా గెలువగానే ఆమెను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వంలో కీలకమైన శాఖను అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఆరేళ్ళ కాలపరిమితి గల ఈ ఎమ్మెల్సీ పదవీ కాలం 2022 జనవరిలో ముగియనుంది. అంటే కవిత ఎమ్మెల్సీ పదవిలో ఇంకా 15 నెలలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. 2016 జనవరి 5న ఈస్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి భూపతిరెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు రాజీనామా చేసి.. నిజామాబాద్ రూరల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనను పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హుడిగా ప్రకటించారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సుమారు 20 నెలలకు పైగా ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఇప్పుడు ఉపఎన్నిక జరగబోతోంది. తాజా అంచనాలను బట్టి కవిత సులువుగా గెలిచే అవకాశాలున్నాయి. మరి ఆమె మంత్రివర్గంలో చేరుతారా? లేక ఎమ్మెల్సీగానే కొనసాగుతారా? వేచి చూడాల్సిందే.