ఇప్పుడంటే స్వేచ్చగా స్వతంత్ర ఫలాలను అనుభవిస్తూ కోరుకున్న జీవితాన్ని ఆస్వాదిస్తున్నాం కానీ ఇదంతా ఎందరో యోధులు చేసిన పోరాటాల త్యాగఫలం అని ఎందరు గుర్తిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15న దేశమంతా సంబరాలు జరుపుకోవడం వెనుక ఎందరి రక్తాశ్రువులు ఉన్నాయో తెలిసింది ఎందరికి. అందుకే వీటిని ప్రతిబింబించే సినిమాలు రావడం చాలా అవసరం. గాంధీ, అల్లూరి సీతారామరాజు లాంటి క్లాస్సిక్స్ అప్పుడప్పుడు వచ్చినా అవన్నీ వ్యక్తుల గొప్పదనాన్ని వారి ప్రస్థానాన్ని చూపించినవి. అలా కాకుండా సగటు మనిషి అందులోనూ యుద్ధఖైదీలుగా మారిన భారతీయులు పడిన కష్టాన్ని తెరమీద గొప్పగా చూపించిన ప్రయత్నమే కాలాపానీ.
1996లో దర్శకుడు ప్రియదర్శన్ బ్రిటిష్ కాలంలో అండమాన్ నికోబార్ జైలులో జరిగిన ఆగడాలను, అప్పటి పౌరులు చూపిన నిబద్దతను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు.తానే స్వయంగా రీసెర్చ్ చేసి అద్భుతమైన స్క్రిప్ట్ తయారు చేశారు. కథ విపరీతంగా నచ్చడంతో మోహన్ లాల్ నటించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా మారేందుకు సిద్ధపడ్డారు. మరో హీరోగా ప్రభుతో పాటు క్యాస్టింగ్ ని భారీగా సెట్ చేసుకున్నారు. పలువురు తమిళ హింది తెలుగు నటీనటులను దీని కోసం ఎంచుకున్నారు. మెయిన్ హీరొయిన్ గా టబు ఎంపికయ్యింది. పరమ దుర్మార్గుడైన జైలర్ గా అమ్రిష్ పూరి నటన నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఉంటుంది.
ఇళయరాజా సంగీతం, సంతోష్ శివన్ ఛాయాగ్రహణంతో 6 కోట్లకు పైగా బడ్జెట్ తో కాలాపానీ రూపొందింది. అప్పటిదాకా మలయాళం చరిత్రలో ఇదే భారీ బడ్జెట్. టబు, వినీత్, అను కపూర్, టినూ ఆనంద్, ఢిల్లీ గణేష్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఎన్నో సెట్లు వేశారు. చాలా కష్టనష్టాలు ఎదురుకోవాల్సి వచ్చింది. మార్చ్ 5న విడుదలైన కాలాపానీకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. హిందిలో అమితాబ్ బచ్చన్ హక్కులు కొని డబ్బింగ్ చేశారు. తెలుగులోనూ మంచి విజయం అందుకుంది. మోహన్ లాల్ ఎలాంటి ఈగోలకు పోకుండా అమ్రిష్ పూరి బూట్లను నిజంగానే నాలుకతో తుడిచే సన్నివేశం అప్పట్లో సెన్సేషన్. ఇలా ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న కాలాపాని లాంటి సినిమాలకు కాలదోషం ఉండదు.