ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుడుగా పని చేస్తున్న ప్రముఖ సంపాదకుడు కొండుభట్ల రామచంద్రమూర్తి ఈ రోజు తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లంకు పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు.
గత ఏడాది సెప్టెంబర్లో రామచంద్రమూర్తి జగన్ ప్రభుత్వంలో విద్య, వైద్యం, దళిత, గిరిజన సంక్షేమ అంశాల్లో ప్రభుత్వ సలహాదారుడుగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన సాక్షి మీడియా ఎడిటోరియల్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. అక్కడ ముందుగా కుదుర్చుకున్న మూడేళ్ల ఒప్పందం ముగియడంతో ఎడిటోరియల్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే సీఎం జగన్ తన ప్రభుత్వ సలహాదారునిగా రామచంద్రమూర్తిని నియమించారు.
ఆంధ్రజ్యోతి, సాక్షి, హెచ్ఎంటీవీ సహా పలు సంస్థల్లో ఆయన ఉన్నత హోదాలో పని చేశారు. ప్రస్తుతం రామచంద్రమూర్తి వయస్సు 72 సంవత్సరాలు.