నేడు తాడిపత్రి ఎమ్మార్వో కార్యాలయం వద్ద మౌనదీక్ష నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు జేసీ బ్రదర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. జేసీ బ్రదర్స్ ప్రకటనతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా జేసీ బ్రదర్స్ నిర్వహించే దీక్షలకు అనుమతులు లేవని పోలీసులు వెల్లడించారు.
తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా తాడిపత్రిలో 144 సెక్షన్ విధించారు. అంతేకాకుండా తాడిపత్రిలో 30 పోలీస్ యాక్టు అమల్లో ఉందని.ల్ ధర్నాలు, నిరసనలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా పోలీసు శాఖ అనంతపురం నుంచి తాడిపత్రి వరకు భారీగా పోలీసులను మోహరించింది. జేసీ బ్రదర్స్ ఇళ్లతో పాటుగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిమీదుగా పోలీసులు కవాతు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో పోలీసులు జేసీ సోదరులను గృహనిర్బంధం చేశారు. దీంతో ప్రభాకర్ రెడ్డి భార్య ఉమారెడ్డి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి, తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఎమ్మార్వో కార్యాలయానికి సిబ్బంది చేత తాళం వేయించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేయడంతో ఆయన నల్లదుస్తులు ధరించి ఇంట్లోనే దీక్షకు దిగారు.