మొదట లోక్ సత్తా, ఆ తర్వాత జనసేన అంటూ నిత్యం జగన్ మీద తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించే కుసుంపూడి శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు. ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్స్ తో చిక్కుల్లో పడ్డారు. ఫేక్ ప్రచారం సాగిస్తూ చట్టానికి చిక్కారు. ఇప్పటికే పలుమార్లు ఆయన చేసిన ప్రచారం పట్ల చూసీ చూడనట్టు వ్యవహరించిన యంత్రాంగం, కరోనా సమయంలో సామాజిక విద్వేషాలు పెంచే విషయంలో ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. దానికి అనుగుణంగా శ్రీనివాస్ ని అరెస్ట్ చేసి ఏపీకి తరలించేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కుసుంపూడి శ్రీనివాస్ తొలుత లోక్ సత్తాలో కనిపించేవారు. ఆతర్వాత మొన్నటి ఎన్నికల సందర్భంగా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆపార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. పవన్ సోదరుడు నాగబాబుకి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఆ క్రమంలోనే సోషల్ మీడియాలో కొంత హద్దులు మీరుతుండడం ఆయన నైజం అని అంతా భావిస్తూ ఉంటారు. అందుకు తోడుగా చంద్రబాబు పట్ల ప్రత్యేక అభిమానం ప్రదర్శించేందుకు తగ్గట్టుగా ఏపీ ప్రభుత్వం మీద నిత్యం దుమ్మెత్తిపోయడమే కుసుంపూడి కార్యక్రమంగా ఉంటుందని చెబుతున్నారు. జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకతను చాటుకునే క్రమంలో హద్దులు మీరడమే ఇప్పుడు ఆయనకు ఇక్కట్లు కొనితెచ్చినట్టుగా కనిపిస్తోంది.
కరోనా సమయంలో నిర్ధారణ కాని అంశాలు ప్రచారం చేయడం చట్ట విరుద్ధ చర్యగా ఇప్పటికే సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది. అందుకు తోడుగా సమాజంలో అశాంతి రగిల్చేలా పోస్టింగ్స్ చేయడం సామాన్యులతో పాటుగా బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవాళ్లకు అసలు తగదు. అయినప్పటికీ కుసుంపూడి మాత్రం కర్నూలు ఆసుపత్రిలో జరిగిన ఓ చిన్న ఘటనను చిలువలు పలువలుగా చిత్రీకరంచే ప్రయత్నం చేశారు. తద్వారా రాష్ట్రంలో కొన్ని వర్గాల పట్ల విద్వేషం రగిల్చే పనికి పూనుకున్నారు. ఇది ఇప్పుడు చట్ట ధిక్కారం కావడంతో ఆయనపై కేసు నమోదయ్యింది. దానికి తగ్గట్టుగా ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ గానీ, కర్నూలు గానీ తరలించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. నిబంధనలు అతిక్రమించిన కుసుంపూడి సమస్యలు కొనితెచ్చుకున్న తరుణంలో ఆయన తీరు పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.