కష్టంగా చెప్పాడో… ఇష్టంగా చెప్పాడో తెలీదు కానీ జనసేన అధినేత గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకే మా మద్దతు అని ప్రకటించారు. బీజేపీ గెలుపు కోసం జనసైనికులు కృషి చేయాలని కోరారు. పవన్ కళ్యా్ణ్ ఈ నిర్ణయం వల్ల సొంత పార్టీతో పాటు బయటి నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. కానీ… జాతి హితమే తనకు ముఖ్యమని, అందుకోసమే బీజేపీకి మద్దతిచ్చామని జస్టిఫై చేసుకున్నారు.
బహిరంగంగా మద్దతు ప్రకటించారు కానీ ఎక్కడా ఎన్నికల ప్రచారంలో జనసేన కార్యకర్తలు కానరాలేదు. బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొనాలని అశించనట్లే కనిపించింది. ఎందుకంటే… పవర్ స్టార్ ను మించిన స్టార్ క్యాంపెయినర్లను బీజేపీ రంగంలోకి దించింది కనుక. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన మద్దతు బీజేపీ కి ఎంత కలిసొస్తుందో తెలీదు కానీ పవన్ అభిమానులు మాత్రం తామే బీజేపీని గెలిపిస్తున్నామన్నంతగా ఫోజులిస్తున్నారు. మరోవైపు… తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న జనసేన అక్కడ బీజేపీ మద్దతును కోరేందుకే జీహెచ్ఎంసీలో మద్దతునిచ్చిందనే వాదనా ఉంది. కానీ… పరిస్థితి చూడబోతే ఆ అవకాశం కూడా జనసేనకు దక్కేలా లేదు. ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి నిలబెట్టాలనుకుంటున్న అభ్యర్థిని ఇప్పటికే బీజేపీ ఇంచుమించు ఖరారు చేసింది.
బీజేపీతో కలిసి నడవాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ అడగకపోయినా నా సైన్యం మీకోసమే అని పదే పదే ప్రకటిస్తున్నారు. తన విదేయతను చాటుకునేందుకు ఇప్పటికే ఢిల్లీ పెద్దలను కూడా కలిసొచ్చారు. పవన్ కళ్యాణ్ కేంద్రంలోని బీజేపీ నేతలను మెప్పించే పనిలో ఉంటే… రాష్ట్ర నేతలు మాత్రం మేము ఆయన మద్దతు కోరలేదని చెబుతున్నారు. తాజాగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ జనసేన మద్దతు తాము కోరలేదని, పవన్ కళ్యాణే బీజేపీ పనితీరు నచ్చి మద్దతిచ్చారని ప్రకటించారు. దీనిపై పవన్ ఫ్యాన్స్ తీవ్రంగానే స్పందించారు. ఈ వివాదం ఇలా ఉండగానే గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో చివరిరోజు జనసేన పార్టీ తళుక్కున మెరిసింది. అమిత్ షా రోడ్ షోలో జనసేన జెండాలు రెపరెపలాడాయి.
గ్రేటర్ ప్రచారంలో ఎక్కడా కనిపించని జనసైనికులు అమిత్ షా రోడ్ షోలో కనిపించడం కాకతాళీయం ఏమాత్రం కాదు. ర్యాలీలో పాల్గొన్న జన సైనికులు పవన్ కళ్యాణ్ తో పాటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు జైకొట్టారు. ఇదంతా ఢిల్లీ పెద్దల దృష్టిలో పడే ప్రయత్నమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. జాతీయస్థాయిలో బీజేపీ కీలక నేత అమిత్ షా ర్యాలీలో జనసేన కార్యకర్తలు పాల్గొనడం అందులో భాగమే అంటున్నారు. మొత్తానికి మాది నామమాత్రపు మద్దతుకాదని ఢిల్లీ పెద్దలకు కూడా జనసేన అధినేత చెప్పగలిగారు. మరి ఢిల్లీ నాయకత్వం జనసేనకు ఆంధ్రలోనైనా సముచిత గౌరవం ఇస్తుందో లేదో వేచిచూడాలి.