సడన్గా స్కూళ్లు మూసేసి జై ఆంధ్రా అన్నారు. 6వ తరగతి చదువుతున్న నాకేమీ అర్థం కాలేదు. ముల్కి డౌన్ డౌన్ అని అరిచారు. సరే అదంతా మనకెందుకు స్కూల్ లేదు, అది చాలు అనుకున్నాను.
ఉద్యమం తీవ్రమైంది. రోడ్డు మీద వూరేగింపులు పెరిగాయి. రాయదుర్గంలో JRS మిల్ వుండేది. కొంత మంది విద్యార్థి నాయకులు మాలాంటి పిల్లల్ని తీసుకెళ్లి మిల్లు మీద రాళ్లు విసిరించారు. పోలీసులొచ్చారు. పిల్లల్ని కొట్టలేదు, పెద్దవాళ్లని కొట్టారు.
రోజులు నినాదాలతో నడుస్తూ వుండగా అనంతపురంలో పోలీస్ కాల్పులు జరిగాయి. కొంత మంది చనిపోయారు. రాయదుర్గంలో వరదయ్య కూడా చనిపోయాడని వార్త.
రాయుదర్గంలో చాలా చిన్నవూరు. జనానికి మాట్లాడుకోడానికి చిన్న విషయం దొరికితే చాలు, రోజుల తరబడి మాట్లాడేవాళ్లు. పోలీస్ కాల్పుల్లో వరదయ్య చనిపోవడం చాలా పెద్ద విషయం. వరదయ్య ఏదో గవర్నమెంట్ ఆఫీస్లో అటెండర్. ఆయన అనంతపురం వెళ్లాడు. బస్టాండ్ దగ్గర పోలీస్ కాల్పులు జరిగితే చనిపోయాడు. ఇదీ విషయం.
ఆయనకి పిల్లలు లేరు. భార్య ఇంట్లో ఏడుస్తూ కూచుంది. అందరూ ఓదారుస్తున్నారు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు కాబట్టి నిజంగా వరదయ్య పోయాడో లేదో ఎవరికీ తెలియదు. మరుసటి రోజు ఆంధ్రప్రభ పేపర్ వచ్చింది. అందులో వరదయ్య పేరు లేదు. కానీ ఆయన భార్య ఏడుపు ఆపలేదు. వరదయ్య ఇంటికొస్తే తప్ప ఆయన బతికున్నట్టు కాదు.
3 రోజులు గడిచాయి. ఏడుపు ఆగలేదు. ఇరుగుపొరుగు వాళ్లు ఏడ్చి, ఓదారుస్తున్నారు. లక్ష్మీ బజారులో సరోజా బస్సు (అప్పట్లో అన్నీ ప్రయివేట్ బస్సులే. సరోజా బస్సు చాలా ఫేమస్) ఆగింది. సంకలో ఒక బ్యాగ్ పట్టుకుని వరదయ్య దిగాడు. అందరూ షాక్. తనపైన ఈ పుకారు వస్తుందని అతనికి తెలీదు. దారి పొడవునా పలకరిస్తున్నారు. స్ట్రయిక్ వల్ల బస్సులు లేక అనంతపురంలో ఇరుక్కుపోయాట. ఇంటికెళ్లగానే భార్య మూర్ఛ పోయింది.
మరుసటి రోజు నుంచి భార్యాభర్తలు వూళ్లో వున్న అన్ని దేవాలయాలు తిరిగారు. అర్చనలు చేయించారు. జై ఆంధ్రా కాల్పులు జరిగి 48 ఏళ్లయింది. సరిగ్గా ఇదే రోజు. వరదయ్య వున్నాడో లేదో తెలీదు. జ్ఞాపకాల్లో మాత్రం వున్నాడు.