ఏపీ రాజకీయాల్లో మత సంబంధిత అంశాల చుట్టూ తిప్పేందుకు విపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా తిరుమల డిక్లరేషన్ పై వాదోపవాదనలకు ప్రయత్నిస్తున్నాయి. చంద్రబాబు ఓ అడుగు ముందుకేసి మత ప్రబోధకుడి స్థాయిలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో సీఎం జగన్ మాత్రం రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఓవైపు ఆర్థిక సమస్యలు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం ఆయన అడుగు వేస్తున్నారు.
అందులో భాగంగా సీఎం జగన్ హస్తిన పర్యటన ఖరారయ్యింది.
ఇప్పటికే రెండుసార్లు పీఎంతో బేటీ విషయం చివరి నిమిషంలో వాయిదా పడింది. జాతీయంగా కీలక అంశాలు ముందుకు రావడంతో గతంలో జగన్ పర్యటనకు ఆఖరి నిమిషంలో బ్రేకులు పడ్డాయి. కానీ ఎట్టకేలకు ఆయన ప్రధానమంత్రి సహా పలువురు ఉన్నత స్థాయి మంత్రులు, అధికారులతో భేటీ అయ్యేందుకు అంతా సిద్దమయ్యింది
మంగళవారం సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళతారు. పీఎం తో భేటీ అవుతారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతున్న తరుణంలో తగిన సహాయం కోసం ఆయన అర్థించబోతున్నారు. జీఎస్టీ బకాయిల కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. పోలవరం నిధులు రీయంబెర్స్ చేయాల్సి ఉంది. వాటితో పాటుగా ఏపీలో కొత్త పారిశ్రామిక విధానం ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు కేంద్రం చేదోడు కోరబోతున్నారు. పోర్టుల, హార్బర్ల నిర్మాణం లో కేంద్రం పాత్ర ఉండాలని వినతిపత్రం అందించే అవకాశం ఉంది.
అదే సమయంలో ఇప్పటికే పార్లమెంట్ వేదికగా వైఎస్సార్సీపీ ఎంపీలు పట్టుబడుతున్నట్టుగా అమరావతి, ఫైబర్ గ్రిడ్ అంశాల్లో సీబీఐ విచారణ కోరే అవకాశం ఉంది. దానికి తోడుగా ఇటీవల ఏపీ హైకోర్టుల పరిణామాలను పీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరుగుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో మూడు రాజదానుల అంశంలో శంకుస్థాపన కార్యక్రమం కూడా అక్టోబర్ లో నిర్వహించబోతున్న తరుణంలో ప్రధానిని ఆహ్వానించడం కూడా ఖాయం అంటున్నారు.
వాటితో పాటుగా వివిధ రాజకీయ అంశాలు కూడా చర్చకు రావచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల పార్లమెంట్ లో కేంద్రానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. కీలకమైన రైతు బిల్లుల అంశంలో పలు మిత్రపక్షాలు కూడా ఎన్టీయేకి షాకిస్తాయని భావించిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ మాత్రం మోడీ సర్కారు అండగా నిలిచింది. అదే సమయంలో జాతీయ విద్యుత్ విధానం అమలులో ఏపీ ప్రభుత్వం చొరవ చూపుతోంది. మోడీ విధానాలను రాష్ట్రాల స్థాయిలో అమలుచేసేందుకు జగన్ కట్టుబడి ఉన్నట్టు అనేక సందర్భాల్లో రూడీ అవుతోంది. ఈ నేపథ్యంలో వారిద్దరి భేటీ కీలకంగా మారబోతోంది.
ఏపీలో చంద్రబాబుతో కలిసి కొందరు బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని వేస్తున్న ఎత్తులు ఒకవైపు సాగుతుండగా జగన్ మాత్రం వ్యూహాత్మకంగా హస్తినలో అడుగుపెట్టడం ఆసక్తికర అంశంగా మారుతోంది. రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి తోడ్పాటు దక్కించుకునే ప్రయత్నంలో సీఎం వేస్తున్న అడుగులు ఏపీకి ప్రయోజనం చేకూర్చాలనే అంచనాలు వినిపిస్తున్నాయి.