ఏపీ ప్రభుత్వం మరో అడుగు వేస్తోంది. నీటిపారుదల రంగంలో ముందడుగు వేసేందుకు సిద్దమయ్యింది. ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాల వినియోగంపై దృష్టిపెట్టింది. రాయలసీమకు మిగులు జలాలు తరలించే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో వరద జలాల వినియోగం కూడా చేసేందుకు ప్రకాశం బ్యారేజ్ దిగువన ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. చాలాకాలంగా ఉన్న ప్రతిపాదనలను ఇప్పుడు ఆచరణలోకి తీసుకురావాలని సంకల్పించింది.
ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏటా వందల టీఎంసీల కృష్ణా జలాలు వృధాగా సముద్రం పాలవుతున్నాయి. వాటిని వినియోగించుకుంటే కృష్ణా, గుంటూరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలు పూర్తిగా తీరిపోతాయనే చెప్పవచ్చు. కానీ అందుకు అనుగుణంగా ప్రతిపాదనలకు ప్రణాళిక రూపం ఇచ్చి, ప్రత్యక్ష ఆచరణకు పూనుకున్న నేతలు కనిపించలేదు. దానిని ఇప్పుడు పట్టాలెక్కించే బాధ్యత తనదే అన్నట్టుగా జగన్ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది.
పలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి భేటీ అవుతున్న ఏపీ క్యాబినెట్ దానికి సంబంధించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఏపీ సచివాలయంలో గురువారం జరగబోతున్న సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ కి దిగువన రెండు బ్యారేజీలు నిర్మించే యోచనలో ఉన్నారు. తద్వారా వరద జలాలను కొంతవరకూ నియంత్రించి, అవసరాలకు అనుగుణంగా వాడుకుంటే మరింత మేలు కలుగుతుందని భావిస్తున్నారు. గతంలో పట్టిసీమ పేరుతో సుమారు 2వేల కోట్లు వ్యయం చేసే బదులుగా ఇలాంటి ప్రతిపాదనలను పూర్తి చేయాలని పలువురు కోరినా చంద్రబాబు చెవికెక్కలేదు.
ఎత్తిపోతల పథకం కారణంగా పట్టిసీమకు ఏటా విద్యుత్ ఖర్చు తడిసిమోపడవుతోంది. అదే సమయంలో కృష్ణా నదికి గడిచిన రెండు సంవత్సరాలలో వరద జలాలు పుష్కలంగా ఉండడంతో పట్టిసీమ ను పట్టించుకునే అవసరమే కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో పట్టిసీమకు బదులుగా రెండు చిన్న చిన్న బ్యారేజీలు నిర్మించి ఉంటే ఎంతో మేలు జరిగేదని అంతా చెబుతున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని , కార్యాచరణకు పూనుకుంటే ఏపీ నీటిపారుదల రంగంలో మరో కీలక అడుగు అవుతుంది. గతంలోనే వైఎస్సార్ జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టగా ఇప్పుడు జగన్ మరింత ముందుకు వెళుతున్నట్టు చెప్పవచ్చు.