వైయస్ జగన్ తాను అధికారంలోకి రాగానే నాణ్యమైన బియ్యాన్ని అర్హులందరికి పంపిణీ చేస్తాం అని చెప్పినట్టుగానే 2019 సెప్టెంబర్ 6న నాణ్యమైన బియ్యం పంపిణీ పథకాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గా శ్రీకాకుళం లోని పలాసలో ప్రారంభించారు. అలాగే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ ఆకలితో పస్తులు ఉండకూడదని, పోషకాహార లోపంతో బాధపడకూడదనే ఉద్దేశంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ బియ్యం కార్డులు మంజూరు అయ్యేలా ఇప్పటికే జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దీంతో రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి షుమారు 1.49 కోట్లకు పైగా బియ్యం కార్డులు అందుబాటులోకి వచ్చాయి.
నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా భారం పడుతుందని తెలిసినా సంక్షేమమే తమ ప్రధమ ఎజండాగా రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కమిషన్ను కూడా ఏర్పాటు చేసింది. ఇక తాజాగా ప్రజా సంక్షేమoలో మరో ముందడుగు వేస్తూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా లబ్ధిదారుల ఇళ్లకే నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ పేదలకు జనవరి 1 నుంచి ప్రత్యక వాహనాలలో ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
ఇప్పటికే బియ్యం పంపిణీ కోసం పౌరసరఫరాల సంస్థ 9,260 మొబైల్ వాహనాలు కొనుగోలు చేసి నిర్ణీత గడువుకు వాహనాలు సిద్ధంగా ఉండేలా ప్రణాళికలను పూర్తి చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దళారులకు నేరుగా చెక్ పడినట్టే చెప్పాలి. అలాగే కొండల్లో గుట్టల్లో నివసించే గిరిజనులకు ఈ నిర్ణయం ఒక వరమనే చెప్పాలి. గతంలో వీరు అర్హులైనా సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో లబ్దిపొందలేకపోయేవారు, ఇక తాజాగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం , మంత్రి కొడాలి నాని చూపిన చొరవతో వీరికి నాణ్యమైన బియ్యం అందే అవకాశం ఏర్పడింది. జగన్ ప్రభుత్వం తీసుకుని వస్తున్న ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాల్లో ఇదొకటిగా చెప్పవచ్చు.