ఏ ఒక్కరికైనా తిట్టేవాళ్లూ ఉంటారు.. పొగిడేవారూ ఉంటారు. ఆ విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అతీతులు కారు. నగదు బదిలీ, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, వర్గాల వారీగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ ఆర్థికంగా ఆదుకోవడం, గతం కంటే వేగంగా, భిన్నంగా సంక్షేమ రథాన్ని నడిపించడం.. వంటి మంచి కార్యక్రమాలు ఎన్ని చేసినా ప్రతిపక్ష టీడీపీ తిడుతూనే ఉంటోంది. జగన్ వ్యతిరేక మీడియా వర్గాలు విమర్శనాత్మక కథనాలు ప్రచురిస్తూనే ఉన్నాయి. జనాన్ని భయపెట్టేలా, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వీటిపై మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారేమో కానీ, జగన్ మాట్లాడడం చాలా తక్కువనే చెప్పొచ్చు.
ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ జగన్ ప్రజలకు మేలు చేసేలా కార్యక్రమాలు చేసుకుంటూ పోవడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. రాజకీయ విమర్శలను, టీడీపీ ఆరోపణలను, తనపై వస్తున్న వ్యతిరేక కథనాలను పట్టించుకున్న దాఖలాలు అంతంత మాత్రమే. ఒక వేలు ఎదుటివారిని విమర్శిస్తుంటే, మిగతా నాలుగు వేళ్లూ రివర్స్ లో వారినే టార్గెట్ చేస్తాయనే సిద్ధాంతాన్ని జగన్ బాగా నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. అందుకే టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు చాలా తక్కువే. పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా హడావిడి లేకుండా సింపుల్ గా చేసుకుంటూ పోవడమే తప్ప.. ప్రచారం కల్పించుకోవడానికి కానీ, వాటిపై వస్తున్న దుష్ప్రచారంపై స్పందించడానికి కానీ జగన్ ఆది నుంచీ అంతగా ఆసక్తి చూపడం లేదు.
Also Read:ఎన్నికలు జరిగే ఆ ఐదు రాష్టాలలో నాలుగు బీజేపీకేనట..!
అయితే, ప్రభుత్వంపై టీడీపీ, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో తాజాగా స్పందించారు. అక్కడ కూడా సూటిగా, సుత్తి లేకుండా అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతోంది.. ఎల్లో మీడియా అప్పుడు స్పందించిన విధానాన్ని, ఇప్పుడు అవలంబిస్తున్న పద్ధతిని చాలా క్లియర్ గా వివరించారు.
ఎంఎస్ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్టైల్ పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాల విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గతంలో హడావిడి ఎక్కువగా ఉండేది. పెద్ద పెద్ద సదస్సులు పెట్టేవారు, కాగితాల మీద అగ్రిమెంట్లు పెట్టుకునేవారు, ఆ రోజుల్లో అక్కడ ఏమీ జరక్కముందే.. మైక్రోసాఫ్ట్ వచ్చేసింది.. ఎయిర్‌బస్ వచ్చేసింది అని మరో రోజు, బుల్లెట్ రైలు వచ్చేసిందని మరో రోజు ఇలా హెడ్‌లైన్స్ పెట్టి రాసేవారు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా పక్కనపెట్టి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేయకుండా నిజంగానే పరిశ్రమలను తీసుకురావడానికి అడుగులు ముందుకేస్తున్నాం. పరిశ్రమలు ఎక్కడ వస్తున్నాయో.. మన కళ్లముందే కనిపిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు కూడా మన కళ్లముందే కనిపిస్తున్నాయి.” అంటూ హుందాగా బదులిచ్చారు.
అంతేకాదు.. ‘‘ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా వివక్షకు ఆస్కారం ఇవ్వకుండా ప్రతి పేద లబ్ధిదారునికి డీబీటీ పద్ధతిలో వారి అక్కౌంట్లోకి వేస్తున్నాం. ఈ 27 నెలలకాలంలో మన ఇచ్చిన డబ్బు కుటీర, మధ్యతరహా పరిశ్రమలను నిలబెట్టగలిగాయి, అంతేకాకుండా ఉపాధిని నిలబెట్టడానికి ఉపయోగపడ్డాయి. ఇలాంటి కష్టకాలంలో కూడా ప్రజల కొనుగోలు శక్తి నిలబెట్టగలిగాం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మైనస్ 5శాతం ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితులకు ఆస్కారం లేకుండా మన రైతును, మన వెనకబడ్డ వారిని నిలబెట్టుకోగలిగాం. గ్రోత్‌రేట్ చిన్నదే అయినా నిలబెట్టుకోగలిగాం.
Also Read:ఆ పదవి కోసమే బుచ్చయ్య రాజీనామ డ్రామా ఆడారా?
అప్పోసప్పో చేసైనా సరే అందించిన డబ్బే ఒక రాష్ట్రానికైనా, దేశానికైనా సంజీవని అవుతుందని అంతర్జాతీయ ఆర్థిక వేత్తలు చెప్పినమాట. కాని దురదృష్టవశాత్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటివాళ్లు, తెలుగు దేశం పార్టీవాళ్లు….. ప్రజలను కాపాడుకునేందుకు అప్పోసప్పో చేసే కార్యక్రమాన్ని చేస్తే దాన్ని కూడా నెగెటివ్‌గా చూపించే అధ్వాన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తున్నాయి.” అంటూ అటు తాను చేస్తోంది చెబుతూనే జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఎవరెన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా పండే చెట్టుమీదే రాళ్లు పడతాయి… అని నమ్ముతూ మంచి చేయాలనుకున్న కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఏదేమైనా.. అతస్య ప్రచారం చేస్తున్న వారిపై అప్పుడప్పుడు ఇలా చురకలు అంటించడం మంచిదే అని వైసీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.