వైసీపీ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేసేందుకు అవకాశాలు దొరకకపోవడమో.. లేదా మరే కారణాలు ఉన్నాయో గానీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు వైఎస్ జగన్ కేసుల గురించి ఇటీవల ప్రస్తావిస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన వ్యక్తిని ప్రజలు సరిగా విశ్లేషించకపోవడం వల్లే తమకు ఈ బాధలంటూ ఎన్ఆర్ఐలతో జూమ్‌లో చంద్రబాబు మాట్లాడగా.. ఆ మరుసటి రోజే వైఎస్ జగన్ 43 వేల కోట్ల రూపాయల మనీలాండరింగ్, క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారంటూ నారా లోకేష్ విమర్శించడం గమనార్హం.
వైఎస్ జగన్‌పై ఎలాంటి పరిస్థితుల్లో కేసులు నమోదయ్యాయి..? వాటిపై సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు నెలల తరబడి విచారణ పూర్తి చేసి.. ఛార్జిషీట్లను దాఖలు చేశాయన్న విషయం అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్ కంపెనీలలో సోదాలు, ఖాతాల నిలుపుదల, జగన్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని 16 నెలలు జైలులో పెట్టడం.. ఇలా సాగింది జగన్ ఆస్తులపై సీబీఐ విచారణ. ఈ విచారణ చేసిన అధికారి సీబీఐ జాయింట్ డైరెక్టర్ (జేడీ) లక్ష్మీ నారాయణ.. ఆ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయా కేసులపై కోర్టుల్లో విచారణ జరుగుతోంది.
జగన్ లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, 43 వేల కోట్ల రూపాయలను సీబీఐ నిర్థారించిందని.. 2014 ఎన్నికల్లోనూ, 2019 ఎన్నికల సమయంలోనూ.. అంతకు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీలోనూ, బయటా.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీ నేతలు లెక్కకు మించిన సార్లు మాట్లాడారు. పది పైసలు వాటా ఇస్తే.. ఎక్కడ సంతకం పెట్టమన్నా.. పెడతానంటూ అసెంబ్లీలోనే వైఎస్ జగన్ విసిరిన సవాల్‌కు ఆ వైపు నుంచి సమాధానం లేదు.
వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత జేడీ లక్ష్మీ నారాయణ పలు టీవీ ఇంటర్వ్యూలలో జగన్‌పై కేసుల గురించి మాట్లాడారు. లక్ష కోట్లు అన్నది రాజకీయ నేతలు చేసే ఆరోపణలన్నారు. ఆయనపై సుమారుగా 1500 కోట్ల రూపాయలకు సంబంధించిన కేసులు నమోదు చేశామని చెప్పారు. జేడీ మాట్లాడిన తాలుకూ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు ఇంకా లక్ష కోట్ల అవినీతి, 43 వేల కోట్ల మనీ లాండరింగ్.. అంటూ పాత పాటే లంకించుకుంటున్నారు. చంద్రబాబు, లోకేష్‌ల మాటలు గమనిస్తే.. జగన్ కేసులపై సీబీఐ సరిగా విచారణ చేయలేదన్నట్లుగా వారి తీరు ఉంది. జేడీ లక్ష్మీ నారాయణ విచారణ చేసిన తీరును బాబు, లోకేష్‌లు శంకిస్తున్నట్లే. ఈ మాటలు వింటున్న జేడీ లక్ష్మీ నారాయణ ఎలా స్పందిస్తారో..?
Also Read : సుధాకర్, రఘురామరాజు.. ఇక జడ్జి రామకృష్ణ వంతు..!