ఏపీ శాసనమండలి ఎన్నికల సంరంభం మొదలయ్యింది. అధికార పార్టీ పూర్తి పట్టు సాధించేందుకు అడుగులు వేస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీల భర్తీతో పాటుగా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో ఈసారి వైఎస్సార్సీపీకి పూర్తి ఆధిక్యం దక్కబోతోంది. ఒకేసారి 14 స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అన్నింటినీ ఏకగ్రీవంగా కైవసం చేసుకునే దిశలో పాలకపక్షం ఉంది. ప్రతిపక్షం కూడా పోటీ చేసే యోచనలో లేదని తెలుస్తోంది. కుప్పం వంటి స్థానిక ఎన్నికల్లోనే అడ్డంకులు అధిగమించేందుకు సతమతమవుతున్న వేళ మండలి ఎన్నికల బరిలో దిగే యోచన తమకు లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. దాంతో టీడీపీ పోటీ చేసేందుకు సిద్ధంగా లేకపోవడం వల్ల అధికార పార్టీకి తిరుగులేని ఏకగ్రీవ విజయాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. టీడీపీ పోటీ చేసేందుకు సిద్ధపడినా ఓటమి ఖాయం కాబట్టి బరిలో దిగి చేతులు కాల్చుకోవడం కన్నా దూరంగా ఉండడమే మేలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
శాసనమండలిలో ఆధిక్యాన్ని ఉపయోగించుకుని ఇంతకాలంగా టీడీపీ పలు అడ్డంకులు సృష్టించింది. ముఖ్యంగా పాలనా వికేంద్రీకరణ బిల్లుల వ్యవహారంలో స్వయంగా చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని నడిపిన తంతు పెనుదుమారంగా మారింది. ఈనేపథ్యంలో టీడీపీ రానురాను తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. ఎట్టకేలకు వైఎస్సార్సీపీకి పూర్తి మెజార్టీ దక్కబోతోంది. ఇప్పుడు ఏకంగా ఒకేసారి 14 మంది ఎమ్మెల్సీలు వైఎస్సార్సీపీ తరుపున మండలిలో అడుగుపెట్టబోతున్నారు. దాంతో ఆపార్టీ బలం ఒకేసారి 34 వరకూ చేరువయ్యే అవకాశం ఉంది. మద్ధతిస్తున్న ఎమ్మెల్సీలతో కలిపి మూడింట రెండొంతుల ఆధిక్యం దక్కబోతున్న తరుణంలో మండలి వ్యవహారాల్లో కూడా పాలకపక్షం పూర్తి హవాని చాటేందుకు ఛాన్స్ వస్తుంది.
Also Read : YCP MLC Aspirants – 14 ఎమ్మెల్సీ పదవులు.. ఆశానువాహులు ఎవరు..?
శాసనమండలిలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ స్థానాలు కూడా ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. తాత్కాలికంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ తరుపున ఉన్న విఠపు బాలసుబ్రహ్మణ్యం చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈనెలాఖరులోగా అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న తరుణంలో కొత్త చైర్మన్ ఎంపిక ఉంటుందా లేక స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలు కూడా వచ్చిన తర్వాత చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. దాంతో కొత్త ఎమ్మెల్సీలలో సీనియర్లకు చైర్మన్ పీఠం కూడా దక్కబోతోందని చెబుతున్నారు. ప్రస్తుతం మూడు ఎమ్మెల్యే కోటా సీట్లకు పేర్లు దాదాపు ఖరారయినట్టు తెలుస్తోంది. అందులో బద్వేలుకి చెందిన గోవిందరెడ్డి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన విక్రాంత్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మూడో స్థానం మహిళకు కేటాయించే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల కోటాకి సంబంధించి మర్రి రాజశేఖర్, తలశిల రఘురామ్ పేర్లు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఖరారయినట్టు ప్రచారంలో ఉంది. ఇద్దరూ కమ్మ కులస్తులే కావడంతో ఇద్దరికీ అవకాశం వస్తుందా లేదా అన్నదే చర్చనీయాంశం. అదే సమయంలో ఈసారి కాపు కోటాలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్థానం ఎవరికి దక్కుతోందననే ఆసక్తి కూడా ఉంది. ప్రధానంగా బీసీలు, మహిళలకు పెద్ద పీట వేయాలని జగన్ నిర్ణయం తీసుకున్న తరుణంలో వివిధ కులాల నుంచి మహిళలు ఎక్కువ మందికి అవకాశం రాబోతోంది. అదే సమయంలో ఇప్పుడు ఎన్నికయ్యే ఎమ్మెల్సీలలో ఒకరిద్దరికి మంత్రి పదవులు, ఇతర కీలక స్థానాలు దక్కే అవకాశం ఉండడంతో పోటీ ఎక్కువగా కనిపిస్తోంది.
Also Read : AP MLC Elections – మోగిన ఎమ్మెల్సీ నగారా.. ఎన్నిక లాంఛనమే.. వైసీపీలో సందడి