ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా ఉన్న సమయంలో తీసుకున్న ఒక్క నిర్ణయం ఆయన పదవికే ఎసరు పెట్టింది. నాలుగు నెలల పాటు న్యాయస్థానాల చుట్టూ తిరిగేలా చేసింది. ఆఖరికి ఉపశమనం దక్కిందా అంటే సానుకూల సమాధానం దక్కడం లేదు. గవర్నర్ ని కలిసి విన్నవించుకోవాలని ఇచ్చిన హైకోర్ట్ సూచన ప్రకారం అనుసరించిన నేపథ్యంలో ఇక ఆ తర్వాత ఆయనకు ఏమీ మిగలలేదనే చెప్పవచ్చు. ఈ పరిణామాలతో ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ కథ ముగిసినట్టేనని చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా స్థానిక ఎన్నికల వాయిదాతో ఒక్కసారిగా నిమ్మగడ్డ పేరు మారుమ్రోగింది. ఐదేళ్లుగా ఆయన అదే పదవిలో ఉన్నప్పటికీ ఎన్నడూ ఆయన పేరు ప్రస్తావించిన వాళ్లు కరువయ్యారు. కానీ ఒక్కసారిగా స్థానిక ఎన్నికలను కరోనా కారణం చూపించి, ప్రభుత్వానికి సమాచారం లేకుండా విచక్షణాధికారం వినియోగించానని చెప్పుకున్న నిమ్మగడ్డ నాలుగు నెలల పాటు తీవ్ర సమస్యలు ఎదురయ్యాయి. ఆయన్ని పదవి నుంచి తొలగించి, ఆ తర్వాత ఏకంగా చట్టాన్ని కూడా సవరించిన నేపథ్యంలో కొత్త అధికారిని తెరమీదకు తీసుకురావడంతో నిమ్మగడ్డ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వచ్చింది.
Also Read: ఎమ్మెల్సీ ఎన్నిక – మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్
తొలుత ఏపీ హైకోర్ట్ కి, ఆ తర్వాత సుప్రీంకోర్ట్ కి ఆయన ఖరీదైన అడ్వొకేట్స్ ని పెట్టుకున్నారు. కోట్ల రూపాయల వ్యయం భరించాల్సి ఉంటుందని అంచనాలున్నాయి. అయినప్పటికీ నిమ్మగడ్డ ఎంత వ్యయం చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. చివరకు ఏపీ హైకోర్ట్ సూచనతో , గవర్నర్ ని కలిసిన తర్వాత నిమ్మగడ్డ మాటల్లో కనిపించిన నిస్తేజం ఆయనకు తీవ్ర నిరాశను కలిగించిన పరిణామాలకు నిదర్శనంగా ఉంది. ఎంతగా ప్రయాస పడినా పరిస్థితులు తనకు అనుకూలించలేదనే నైరాశ్యం ఆయన్ని చుట్టుముట్టినట్టు కనిపిస్తోంది. కోర్ట్ చెప్పింది, గవర్నర్ ని కలిశాను, ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని ఆయన చెప్పడం ద్వారా తనకు ఖచ్చితంగా ఆశించిన ఫలితం వస్తుందనే ఆశాభావం ఆయనలో కనిపించలేదనే చెప్పవచ్చు.
తొలుత ఎన్నికలు వాయిదా వేయడం , ఆతర్వాత హోం శాఖకి రాసిన లేఖ, అన్నింటికీ మించి పార్క్ హయత్ హోటల్ లో సుజనా, కామినేనితో సమావేశం ద్వారా నిమ్మగడ్డ తీవ్ర దుమారం రేపారు. అన్నింటికీ మించి ఆయన నైతికంగా విలువను కోల్పోయారు. జగన్ ప్రభుత్వ తీరు పట్ల సంతృప్తి గా లేని చాలామంది చివరకు నిమ్మగడ్డ వ్యవహారంతో ఆయనకు దూరం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం వచ్చే జూన్ 31తో ఆయన పదవీ కాలం ముగియబోతున్న తరుణంలో ఈ ఆరు నెలల్లో ఆయనకు అవకాశం దక్కే ఆనవాళ్లు కనిపించడం లేదు. అదే సయమంలో ఆరోజు ఎన్నికలు వాయిదా వేయడం ద్వారా నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని ప్రస్తుత పరిణామాలు చాటుతున్నాయి. కరోనా విజృంభించిన నేపథ్యంలో ఆనాడే ఎన్నికలు పూర్తి చేసి ఉండాల్సిందనే వారు పెరుగుతున్నారు. ఇక ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేనందున కరోనా సమయంలో స్థానిక సంస్థల పాత్ర మరింత చురుగ్గా ఉండే అవకాశం కోల్పోయామని చాలామంది భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం సుప్రీంకోర్ట్ లో ఉన్న ఏపీ ప్రభుత్వ కేసు మినహా రాబోయే కాలంలో ఆయన పేరు పెద్దగా వినిపించే అవకాశాలు లేవని ఈ పరిణామాలన్నీ చాటుతున్నాయి.
Also Read:ఆ ఇద్దరు మంత్రుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం
ఏమయినా రాజకీయ ప్రకంపనలు రేపిన నిమ్మగడ్డ అనూహ్యంగా చల్లబడాల్సి వచ్చింది. న్యాయస్థానాల సహాయంతో ఏపీ ప్రభుత్వాన్ని తన దారికి తెచ్చుకోవాలని ఆశించిన ఆయన చివరకు చేదు ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది. ఏమయినా మొత్తంగా ఏపీ రాజకీయాల్లో ఆయన ఎపిసోడ్ అనేక అనుభవాలకు కారణం అయ్యిందనే చెప్పవచ్చు. జగన్ వంటి నేతలకు ఆదిలోనే ఎదురయిన ఈ అనుభవం ఆయన భవిష్యత్ పరిణామాలకు ఓ గుణపాఠంగానే చెప్పవచ్చు.