ఉత్తరప్రదేశ్లో ఫిరాయింపుల పర్వం జోరందుకుంది. రాజకీయ హీట్ రాజుకుంది. పేరు ప్రతిష్టలు ఉన్న నేతలను తమ వైపు తిప్పుకొనేందుకు పార్టీలు ఒకవైపు ప్రయత్నిస్తుంటే మరోవైపు తాము ఉన్న పార్టీకి విజయావకాశాలు లేవనో.. లేక టికెట్లు లభించవన్న భయంతోనో నాయకులు అవకాశాలు వెతుక్కుంటూ వేరే పార్టీల్లో చేరుతున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజుకో రూపం సంతరించికుంటున్నాయి. ముఖ్యంగా బీజేపీ,సమాజ్వాదీ పార్టీల మధ్య జోరుగా వలసలు సాగుతున్నాయి. బీజేపీ నుంచి ముగ్గురు మంత్రులు, 11 మంది ఎమ్మెల్యేలు ఎస్పీలోకి జంప్ చేస్తే బీజేపీ ఏకంగా పార్టీ వ్యవస్థాపకుడు ములాయం కుటుంబాన్నే టార్గెట్ చేసింది. ఆయన చిన్న కోడలు అపర్ణ యాదవ్ కమలం పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కుటుంబ విభేదాలను సొమ్ము చేసుకునే యత్నం
ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధన గుప్తా కుమారుడు ప్రతీక యాదవ్ సతీమణి అపర్ణ యాదవ్. 2017 ఎన్నికల్లో ఆమె లక్నోలోని కాంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం రీటా బీజేపీలో చేరి ఎంపీగా ఉన్నారు. ములాయం కుటుంబంలో కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఆయన నచ్చజెప్పడంతో ఈ ఎన్నికల్లో ఎస్పీ తరఫున ప్రచారం చేస్తానని అపర్ణ కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు. కానీ మళ్లీ ఏమైందో గానీ అపర్ణ బీజేపీలో చేరి కాంట్ నుంచే పోటీ చేయనున్నట్లు ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ జాగరన్ ఒక కథనం ప్రచురించింది. సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం జరుగుతోంది. అపర్ణ యాదవ్ కుటుంబీకులు దీన్ని ఖండించకపోవడంతో ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది. దీనికితోడు అపర్ణ, ప్రతీక్ దంపతులు కొన్నాళ్లుగా బీజేపీ పెద్దలతో సన్నిహితంగా మెలుగుతున్నారు.
ములాయం స్నేహితుడు బీజేపీలోకి
కాగా ములాయం కుటుంబ స్నేహితుడు హరి ఓం యాదవ్ ఇప్పటికే బీజేపీలో చేరిపోయారు. ముగ్గురు ఓబీసీ మంత్రులు, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరిపోవడంతో కలవరపాటుకు గురైన కమల దళపతులు ఎత్తుకు పైఎత్తు అన్నట్లు ఎస్పీ నుంచి వలసలను ప్రోత్సహిస్తుండటంతో రాజకీయం రంజుగా మారింది.