టాలీవుడ్ లో ఇప్పటిదాకా చాలా సీక్వెల్స్ వచ్చాయి. కొన్ని మొదటి భాగానికి నిజమైన కొనసాగింపుగా ఉంటే అధిక శాతం కేవలం టైటిల్ లో 2 అని పెట్టేసి పూర్తిగా వేరే కథలతో రూపొందించినవి. కానీ వీటికి సక్సెస్ పర్సెంటేజ్ చాలా తక్కువ. ఒక్క బాహుబలి మాత్రమే దీన్ని బ్రేక్ చేసి ఫస్ట్ పార్ట్ కంటే పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది. కిక్ 2, సర్దార్ గబ్బర్ సింగ్, మంత్ర 2, గాయం 2, ఆర్య 2, రక్త చరిత్ర 2, సత్య 2, అవును 2 ఇలా ఎన్నో డిజాస్టర్లు సాక్ష్యాలుగా నిలుస్తాయి. అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం వర్మ మనీ సీక్వెల్ సైతం ఇలాంటి ఫలితమే అందుకుంది. అయినా కూడా వీటి నిర్మాణాలు ఆగలేదు. ఇటీవలే అడవి శేష్ హీరోగా హిట్ 2 ప్రకటించిన సంగతి తెలిసిందే.
వీటి సంగతలా ఉంచితే జాతిరత్నాలు సీక్వెల్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇన్ సైడ్ టాక్. ఇప్పటికే ఐడియాని డెవలప్ చేశారని, నవీన్ పోలిశెట్టి-రాహుల్ రామకృష్ణ-ప్రియదర్శిలతో పాటు ఫరియా అబ్దుల్లాను కూడా కొనసాగించబోతున్నారట. ఈ నలుగురు అమెరికా వెళ్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో దర్శకుడు అనుదీప్ ఓ లైన్ సిద్ధం చేశారట. ఎలాగూ స్వప్న సినిమా బ్యానర్ లోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కమిటయ్యాడు కాబట్టి అదేదో జాతిరత్నాలు 2 తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను ఈ రకంగా కార్యరూపంలోకి తీసుకురాబోతున్నారన్న మాట. అయితే ఇదింకా అధికారికంగా ప్రకటించలేదు
కానీ జాతిరత్నాలు అంత పెద్ద హిట్టవ్వడానికి కారణాలు ఏమైనప్పటికీ ఓటిటిలోకి వచ్చాక మాత్రం సోషల్ మీడియాలో నెగటివ్ ఫీడ్ బ్యాక్ గట్టిగానే వచ్చింది. ఈ నేపథ్యంలో కొనసాగింపు ఎంత మేరకు వర్కౌట్ అవుతుందన్నది చూడాలి. అందులోనూ ఏదో గాలివాటం హిట్టనే కామెంట్స్ వచ్చాయి కాబట్టి ఒకవేళ నిజంగా సీక్వెల్ తీస్తే దాని మీద చాలా ఒత్తిడి ఉంటుంది. అమెరికా షూట్ అంటే ఇప్పుడప్పుడే పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా విదేశీ ప్రయాణాలు కష్టమైన నేపథ్యంలో ఒకవేళ ఇది తీయాలనుకున్నా టైం పడుతుంది కాబట్టి ఆలోగా నవీన్ మరొకటి కమిట్ అవుతాడేమో చూడాలి