దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇప్పుడు ఆ రాష్ట్రం ముక్కలు కానుందా? త్వరలోనే అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. అంతకు ముందే ఈ ప్రకటన వెలువడనుందా? విభజనకు కేంద్రం సిద్ధమవుతోందా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది. ఇందుకోసమే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ రెండు రోజులుగా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారని తెలుస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి యోగి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు స్థానికసంస్థల ఎన్నికల్లో తేలిపోయింది.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ద్వారా దేశంలో బీజేపీ ప్రాభవం తగ్గుతోందని తెలుస్తోంది. దీంతో త్వరలో జరగబోయే రాష్ట్రాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లో మరోసారి పాగా వేసి తీరాల్సిందే అన్న పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే తాజాగా యోగి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ప్రధాని మోడీ అమిత్ షాలను కలుసుకున్నారు. దీంతో యోగిని మార్చుతారా? రాష్ట్రాన్ని విభజిస్తారా? ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. యూపీలో సీఎం మార్పు..కేబినెట్ విస్తరణ అంశాలు తెరపైకి వచ్చాయి.
యూపీ రాష్ట్ర విభజనకు సీరియస్ గా పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని విభజించి కొత్తగా ప్రత్యేక పూర్వాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపైనే యోగిని ఢిల్లీకి రప్పించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రాన్నిరెండు ముక్కలు చేసైనాసరే అక్కడ అధికారంలోకి రావాలని.. సీట్లు గెలవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోందని సమాచారం.
యూపీలోని గోరఖ్ పూర్ సహా 25 జిల్లాలను పూర్వాంచల్ లో కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు దిశగా మోడీ సర్కార్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రాష్ట్రంలో 125 అసెంబ్లీ సీట్లు ఉండే అవకాశం ఉంది.ఇక ఇప్పటికే యూపీలో పూర్వంచల్ తోపాటు బుందేల్ ఖండ్ హరిత ప్రదేశ్ రాష్ట్రాల డిమాండ్ ఉంది. గతంలో మాయావతి ముఖ్యంమత్రిగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ ను ఐదు రాష్ట్రాలుగా విభజించాలని తీర్మానం చేశారు. కానీ బీజేపీ,సమాజ్ వాది పార్టీ ఆ తీర్మానాన్ని వ్యతిరేకించాయి.