క్రికెట్ అంటే ఇంగ్లాండ్ అని పేరు. ఆ దేశంలోనే పుట్టిన ఈ క్రీడకు అతి పెద్ద క్రికెట్ మైదానం లార్డ్స్. ఈ మైదానంలో అడుగుపెట్టాలని ప్రతి క్రికెటర్ కలగంటాడు. అలాంటి మైదానంలో విజయ సంబరాలు చేసుకోవాలనేది క్రికెటర్ల కల. అందులోనూ ఇంగ్లాండ్ జట్టును వారి సొంత క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో ఓడించడం అంటే సాధారణ విషయం కాదు. అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసుకున్న భారత క్రికెట్ జట్టు అద్భుతమైన విజయంతో విమర్శకుల ప్రేమను పొందగలిగింది..
ఇంగ్లాండ్ జట్టును లార్డ్స్ లో టెస్ట్ మ్యాచ్ లో ఓడించడం భారత జట్టుకు ఇది మూడో సారి మాత్రమే. 89 సంవత్సరాల లార్డ్స్ మైదానం చరిత్రలో భారత జట్టు ఇంగ్లాండ్ జట్టు తలపడిన మ్యాచ్‌లు 18 అయితే, మూడు సార్లు మాత్రమే ఇండియా విజయం సాధించింది. 11 సార్లు మ్యాచ్ ను డ్రా గా, నాలుగు సార్లు ఇండియా ఓడిపోయింది. లార్డ్స్ మైదానంలో ఇండియా 2014 జూలై 31 వ తేదీన టెస్ట్ ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో అప్పట్లో చారిత్రక టెస్టుల్లో విజయం సాధించిన ఇండియా మళ్లీ చాన్నాళ్ల తర్వాత లార్డ్స్ లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
1932 లో మొదటి టెస్టు మ్యాచ్ లార్డ్స్ లో ఇంగ్లాండ్ మీద ఆడిన ఇండియా ఘోర ఓటమిని చవిచూసింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు మీద 158 రన్స్ తేడాతో ఇండియా ఓడిపోయింది. మళ్ళీ అదే గ్రౌండ్లో ఇంగ్లండ్ ను ఓడించడానికి 54 సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. 1986 లో లార్డ్స్ మైదానంలో భారత జట్టు మొదటి విజయాన్ని ఇంగ్లాండ్ మీద అందుకుంది. ఆ తర్వాత మళ్లీ రెండో విజయం సాధించడానికి సైతం 28 ఏళ్లు పట్టింది. 2014లో రెండో విజయం సాధించిన భారత దేశం మూడో విజయం కోసం కేవలం 7 ఏళ్లు మాత్రమే వేచి చూసి అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
లార్డ్స్ టెస్ట్ లో ఇండియా స్పిన్నర్లు లేకుండానే బరిలోకి దిగింది. రవీంద్ర జడేజాను అవసరమైతే స్పిన్నర్ గా వినియోగించుకోవాలని భావించడంతో ఏకంగా నలుగురు సీమర్ లతో ఫాస్ట్ బౌలింగ్ ను కోహ్లీ నమ్ముకున్నాడు. మొత్తం అన్ని ఓవర్లను నలుగురు ఫాస్ట్ బౌలర్లు వేసి ఇండియా కు విజయాన్ని అందించారు.
ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అంశం లో విరాట్ కోహ్లీ నిర్ణయం సరైనది అని నిరూపితమైంది. మహమ్మద్ షమీ 56 రన్స్ చేసి మంచి ఊపు లో ఉన్న సమయంలో కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాను అని చెప్పడం క్రికెట్ క్రీడా అభిమానులకు కాస్త చిరాకు తెప్పించినా, తర్వాత విజయం కోసం కోహ్లీ తీసుకున్న నిర్ణయం ఖచ్చితమైనది అని తెలిసింది. మొదట్లోనే రెండు వికెట్ తీసిన బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ మీద విపరీతమైన ఒత్తిడిని తీసుకురావడంలో విజయం సాధించారు.
వర్షంతో సతమతమై ఆట జరుగుతుందో లేదో అనుకున్న మ్యాచ్‌లో ఇండియా గెలుపు అద్భుతం. చివరి రోజు సైతం హాట్ సాగుతుందో లేదోనన్న అనుమానం నెలకొన్న సమయంలో కేవలం 90 ఓవర్లు మాత్రమే వేయాలని భావించారు. అయితే దీనిలోనూ తర్వాత కోత విధించి నా, ప్రకృతి అనుకూలించి వర్షం రాకపోవడం భారత్ కు లాభదాయకం అయ్యింది.
టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ లు ఎవరు రాణించకున్న రెండో ఇన్నింగ్స్ ను నిర్మించడం లో కచ్చితంగా అజింక్యా రహానేకు మంచి మార్కులు ఇవ్వాలి. మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చిన రహానే చక్కగా ఆడి, మిగిలిన వారిలో స్ఫూర్తి నింపాడు. అదే ఆటను షమి కొనసాగించడం భారత్‌కు కలిసివచ్చింది. లార్డ్స్‌లో భారత్ ఇంగ్లాండ్‌ల మధ్య మరో టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది అన్నది ఇప్పటి వరకు షెడ్యూల్ లేదు. అయితే ఇలాంటి అద్భుతమైన మైదానంలో విజయం నమోదు చేయడం మాత్రం ప్రతి ఆటగాడికి ముఖ్యంగా నాయకత్వం వహించే కెప్టెన్ కు తన కెరీర్లోనే మరపురాని అనుభూతిగా మిగులుతుంది.
వరుసగా భారత జట్టు టెస్ట్ క్రికెట్ లో చారిత్రాత్మక విజయాలు సొంతం చేసుకోవడం విశేషం. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టును వారి సొంత గ్రౌండ్లో, అందులోనూ ప్రపంచంలోనే మేటి అయిన సిడ్నీ, బ్రిస్బేన్ లాంటి గ్రౌండ్లో మట్టి కరిపించిన భారత్ మళ్ళీ అదే ఊపును ఇప్పుడు కొనసాగిస్తోంది అనడంలో సందేహం లేదు. టెస్ట్ క్రికెట్ ఛాంపియన్ షిప్ లో తడబాటు తర్వాత అద్భుతంగా పుంజుకోవడం భారత్ కు పెద్ద పాజిటివ్ అంశమే.