ఇకపై ప్రయాణికుల ఇంటికే సామాన్లు చేరవేత
రైల్వే శాఖ మరో విన్నూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రైలు ప్రయాణికుల సౌకర్యార్థం ‘బ్యాగ్సు ఆన్ వీల్’ సేవలను ప్రారంభించనుంది. ఇకపై రైలు ప్రయాణికుల సామాన్లను ఇంటినుండి రైల్వేస్టేషనుకు, రైల్వేస్టేషను నుంచి ఇంటికి చేరవేయనుంది.
కానీ ప్రస్తుతానికి దేశరాజధాని ఢిల్లీతోపాటు ఘజియాబాద్, గురుగావ్ నగరాల నుంచి ప్రయాణించే ప్రయాణికులకు బ్యాగ్స్ ఆన్ వీల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.బ్యాగ్స్ ఆన్ వీల్ సేవలను ఢిల్లీ జంక్షన్, హజ్రత్ నిజాముద్దీన్, ఢిల్లీ కంటోన్మెంట్, ఢిల్లీ సారాయ్ రోహిల్లా, ఘజియాబాద్, గురుగావ్ రైల్వేస్టేషన్ల నుంచి ప్రయాణించేవారు వినియోగించుకోవచ్చు. ఇకపై ప్రయాణ సమయంలో సామాన్లు ఎక్కువ ఉన్నాయని బాధ పడాల్సిన అవసరం లేదని బ్యాగ్స్ ఆన్ వీల్ సేవలను వినియోగించుకోవడం ద్వారా ఇంటి నుంచి రైల్వేస్టేషనుకు, రైల్వేస్టేషను నుంచి ఇంటి ముంగిటకు ప్రయాణికులు సామాన్లను రవాణా చేయనున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు.
సామాన్లు చేరవేసినందుకు నామమాత్రమైన చార్జీలు వసూలు చేస్తామని బ్యాగ్స్ ఆన్ వీల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం భారతీయ రైల్వేలోనే మొట్టమొదటిసారి అని నార్త్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ రాజీవ్ చౌదరి తెలిపారు.కాగా బ్యాగ్స్ ఆన్ వీల్ సేవలు ప్రస్తుతానికి కొన్ని నగరాలకు మాత్రమే రైల్వేశాఖ పరిమితం చేసింది. ఈ సేవలను దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తే ప్రయాణికులకు మరింత ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.