వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన, అత్యుత్తమ సేవలు అందించిన ప్రముఖులను ఏటా భారత ప్రభుత్వం ఉన్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులతో సత్కరిస్తుంటుంది. అదే రీతిలో ఈ ఏడాది 119 మందికి ఆ అవార్డులు ప్రధానం చేశారు. వీరిలో 102 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉండగా.. వారిలో ఒకరు పాకిస్తాన్ మాజీ సైనికాధికారి కావడం విశేషం. అదేంటి.. మన శత్రుదేశమైన పాక్ మాజీ సైనికుడికి ఉన్నత పౌర పురస్కారం ఇవ్వడం ఏమిటన్న అనుమానం, అసంతృప్తి మనలో కలగడం సహజం. కానీ కేంద్ర ప్రభుత్వం అతనికి ఆ అవార్డు ఇవ్వడానికి కారణాలు తెలిస్తే.. అతను చేసిన సాహస కృత్యాలు, త్యాగాలు తెలిస్తే.. పద్మశ్రీకి అతను పూర్తి అర్హుడేనని ఎవరైనాసరే అంగీకరించక మానరు.
బంగ్లా విముక్తి యుద్ధంలో భారత్ కు సాయం
1971లో పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న తూర్పు పాకిస్తాన్ ప్రజల స్వేచ్చా పిపాసకు మద్దతుగా భారత్ నిలవడంతో భారత్-పాక్ యుద్ధం మొదలైంది. ఆ సమయంలో 20 ఏళ్ల ఖాజీ సజ్జాద్ అలీ జహీర్ పాక్ సైన్యంలో సియోల్ కోట్ కేంద్రంగా లెఫ్టినెంట్ కల్నల్ గా పని చేస్తున్నారు. అయితే తూర్పు పాకిస్తాన్ ప్రజలపై తమ సైన్యం చేస్తున్న అకృత్యాలు, అణిచివేత చర్యలు ఆయనకు నచ్చేవి కావు. దాంతో ఆయన సైన్యం నుంచి విడిపోయి సరిహద్దుల్లో రెండు వైపుల నుంచీ భీకరంగా కాల్పులు జరుగుతున్నా ప్రాణాలకు తెగించి రహస్యంగా పాక్ సరిహద్దు దళాల కళ్లుగప్పి భారత భూభాగంలోకి ప్రవేశించారు. మన సరిహద్దు దళాలు అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. పాక్ గూఢచారి అన్న అనుమానంతో నిర్బంధించి ప్రశ్నించగా.. యుద్ధంలో ఇండియాకు సహాయపడేందుకే వచ్చానని జహీర్ వివరించారు. దాంతో అతన్ని పఠాన్ కోట్ ఆర్మీ కేంద్రానికి తీసుకెళ్లి ఉన్నతాధికారులకు అప్పగించారు. వారి ప్రశ్నలకు సమాధానంగా జహీర్ పాకిస్తాన్ కు చెందిన రహస్య సైనిక పత్రాలు, మ్యాపులు అందజేశారు. దాంతో సంతృప్తి చెందిన ఆర్మీ ఉన్నతాధికారులు అతన్ని ఢిల్లీలోని సురక్షిత ప్రాంతానికి తరలించి మరికొన్ని వివరాలు రాబట్టారు. కొన్ని నెలలపాటు ఢిల్లీలోనే ఉన్న జహీర్.. ఆర్మీ సహాయంతో తూర్పు పాకిస్థాన్ కు చేరుకున్నారు.
ముక్తివాహినికి సాయం
తూర్పు పాకిస్తాన్ లో విముక్తి కోసం పాక్ సైన్యంతో పోరాడుతున్న బెంగాలీ ముక్తి వాహిని సమర యోధులకు జహీర్ అండగా నిలిచారు. గెరిల్లా యుద్ధ రీతుల్లో వారికి శిక్షణ ఇచ్చారు. పాక్ నుంచి స్వాతంత్య్రం సాధించిన తూర్పు పాకిిస్తాన్ బంగ్లాదేశ్ గా అవతరించిన తర్వాత ఆ దేశ సైన్యానికి సేవలు అందించారు. జహీర్ సేవలను ప్రస్తుతించిన బంగ్లా ప్రభుత్వం తమ దేశ ఉన్నత సైనిక పురస్కారం బిర్ ఫ్రొటిక్ (మన దేశ శౌర్యచక్రతో సమానం)తోనూ.. తర్వాత అత్యున్నత పౌర పురస్కారం స్వాధీనత పదక్ తోనూ సత్కరించింది. కాగా బంగ్లా విముక్తి (ఇండో పాక్ వార్) యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్బంగా భారత ఉపఖండానికి పాక్ సైనికాధికారి అయినప్పటికీ జహీర్ చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. కాగా యుద్ధ సమయంలో పారిపోయి శత్రువులకు సహకరించారని తమ మాజీ సైనికాధికారి జహీర్ పై పాకిస్తాన్ ఇప్పటికీ విద్వేషంతోనే ఉంది. అతనికి అప్పట్లోనే ప్రకటించిన మరణ శిక్షను దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ రద్దు చేయకుండా పెండింగులోనే ఉంచింది.
Also Read : Harekala Hajabba – నారింజ పళ్లే ఆ ఊరి దిశను మార్చేశాయ్.. పళ్ళమ్మి స్కూల్ కట్టి పద్మశ్రీ పొంది ..