దశాబ్దాల తరబడి సాగిన అరాచక పాలన, నరమేధంతో కుప్పకూలిన ఆఫ్ఘన్ దేశ పునర్నిర్మాణానికి మానవ, ఆర్థిక వనరులను అందించి భారత్ చేసిన రెండు దశాబ్దాల సేవలు తాలిబన్ ముష్కరుల కారణంగా బూడిద పాలయ్యే ప్రమాదం ఏర్పడింది.
సోవియట్ సేనల ఉప సంహరణ అనంతరం..
1996లో ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్ సంస్థ కబళించింది. ఇస్లామిక్ రాజ్యం పేరుతో మానవ హక్కులను హరించి రాక్షసపాలన సాగించింది. అల్ ఖైదాను తుడముట్టించడంతో పాటు వారికి ఆశ్రయం ఇచ్చిన తాలిబన్లను అణిచివేసేందుకు 2001లో అమెరికా నేతృత్వంలో నాటో సైనిక దళాలు ఆ దేశంలోకి ప్రవేశించడంతో తాలిబన్లు తోక ముడిచారు. దాంతో అక్కడ ప్రజాస్వామ్యం పునరుద్ధరించి.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు.
తాలిబన్ల అరాచకాలు, విధ్వంస పాలనతో తీవ్రంగా నష్టపోయిన ఆఫ్ఘనిస్థాన్ పునర్నిర్మాణానికి అనేక దేశాలు సాయపడుతున్నాయి. వాటిలో భారత్ కూడా ఉంది. పొరుగునే ఉన్న దాయాది దేశంతో స్నేహ సంబంధాలు పెంచుకునే క్రమంలో అనేక రూపాల్లో ఇతోధిక సాయం చేస్తోంది. 2011లో రెండు దేశాల మధ్య కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాల మేరకు సుమారు రూ. 300 కోట్ల డాలర్లు వెచ్చిస్తోంది. ముఖ్యంగా సాగునీరు, విద్యుత్తుకు నోచుకోని ఆఫ్ఘన్ దేశానికి ఆ రెండూ కల్పించే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ నిర్మించి ఇచ్చింది.
1775 కోట్లతో సల్మా ప్రాజెక్ట్
ఆఫ్ఘనిస్తాన్లో నీటి వనరులు చాలా తక్కువ. అలాగే విద్యుత్ ప్రాజెక్టులు అసలు లేవు. ఇతర దేశాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి ముఖ్య పట్టణాలకు సరఫరా చేస్తుంటారు. అటువంటి పరిస్థితుల్లో హెరాత్ ప్రావిన్స్ లోని హురిద్ నదిపై సల్మా డ్యామ్ నిర్మాణాన్ని భారత చేపట్టింది. వాస్తవానికి దీని నిర్మాణం 1976లోనే ప్రారంభమైనా 1979లో సోవియట్ సేనల ప్రవేశం, తర్వాత ముజాహిద్దీన్ గెరిల్లా దాడులు, తాలిబన్ పాలనలో చిక్కుకోవడంతో పనులు నిలిచిపోయాయి.
నాటో సేనల ప్రవేశం తర్వాత పరిస్థితులు కుదుటపడటంతో 2006లో మళ్లీ నిర్మాణం పునఃప్రారంభం అయ్యింది. భారత్ కు చెందిన నాలుగు సంస్థలు టెండర్లలో పాల్గొనగా బెంగళూరుకు చెందిన వాప్కోన్ సంస్థ జాయింట్ వెంచర్ గా దీన్ని చేపట్టింది. 2010లో పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా 2015లో పూర్తి అయింది. 2016 జూన్ నాలుగో తేదీన భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రాజెక్టును ప్రారంభించారు. దీన్ని ఇండో ఆఫ్ఘన్ ఫ్రెండ్షిప్ డ్యాముగా వ్యవహరిస్తున్నారు. దీని ద్వారా 75 వేల హెక్టార్లకు సాగు నీరు అందించడంతోపాటు 42 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. అంచనా వ్యయం కూడా పెరిగి రూ.1775 కోట్లు ఖర్చు అయ్యాయి. డిజైన్ల తయారీ, సాంకేతిక పర్యవేక్షణ అంతా భారత్ అధికారులే చూశారు.
ఇంకెన్నో పనులు
సల్మా ప్రాజెక్టు కాకుండా భారత ప్రభుత్వం ఇంకెన్నో నిర్మాణాలు చేపట్టింది.
-బలూచిస్తాన్ ప్రావిన్సులో ఇరాన్ తో కలిసి చబహర్ రేవును అభివృద్ది చేస్తోంది.
-15 కోట్ల డాలర్ల ఖర్చుతో జరాండ్-డేలారం హైవే నిర్మించింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన 218 కిలోమీటర్ల ఈ రోడ్డు నిర్మాణ సమయంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
-ఆఫ్ఘనిస్థాన్ పాత పార్లమెంటు భవనం దారుల్ అమన్ ను తాలిబన్లు గతంలో పేల్చివేశారు. దాంతో 15 కోట్ల డాలర్ల ఖర్చుతో కొత్త పార్లమెంటు భవనాన్ని భారత ప్రభుత్వం నిర్మించి ఇచ్చింది. దీన్ని ప్రధాని మోదీ 2015లో ప్రారంభించారు.
-విద్యుత్ రంగంలో మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా ఫుల్ ఏ ఖుమ్రి నుంచి కాబూల్ వరకు 220 కె.వి. ట్రాన్స్మిషన్ లైన్ ఏర్పాటు చేసింది.
-రవాణా సౌకర్యాల కల్పనలో భాగంగా 400 బస్సులు, 200 మినీ బస్సులు, 105 యుటిలిటీ వాహనాలు, 10 అంబులెన్సులు, 3 ఎయిర్ ఇండియా విమానాలు సమకూర్చింది.
బూడిదలో పోసిన పన్నీరేనా!
ఆఫ్ఘనిస్థాన్లో 1972 నుంచీ స్నేహ సంబంధాలు, సహాయ కార్యక్రమాలను భారత్ కొనసాగిస్తోంది. 2011 నుంచి ఈ సంబంధాలు మరింత బలపడ్డాయి. దాంతో 400కు పైగా ప్రాజెక్టులు, ఇతర పనులు భారత ప్రభుత్వం అక్కడ చేపట్టింది. వీటిలో చాలావరకు పూర్తి ఆయినా ఇంకా చాలా పెండింగులో ఉన్నాయి. మరోవైపు సల్మా తరహాలో మరో భారీ ప్రాజెక్టు నిర్మించి ఇవ్వాలన్న ఆఫ్ఘన్ ప్రభుత్వ కోరిక మేరకు షాతుత్ డ్యామ్ నిర్మాణానికి గత నవంబరులోనే ఒప్పందం కుదిరింది. దాని డీపీఆర్ కూడా సిద్ధమైంది. ఈ తరుణంలో తాలిబన్లు దేశాన్ని ఆక్రమించడంతో దానికి బ్రేక్ పడినట్లే. నిర్మాణ దశలో ఉన్న పలు పనులు కూడా పూర్తి అయ్యే అవకాశం లేదు. ఇప్పటికే పూర్తి అయిన నిర్మాణాలు, ప్రాజెక్టులను తాలిబన్లు నాశనం చేస్తారేమోనన్న భయాందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి.