దేశంలో కోవిడ్ 19 ఉధృతంగా వ్యాపించడంతో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్చ్ 24 న ఏటీఎం చార్జీలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఏటీఎం చార్జీలు బ్యాంక్ కష్టమర్లపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాంతో మూడు నెలలుగా బ్యాంక్ కస్టమర్లు ఏటీఎం కేంద్రాల నుండి ఎన్నిసార్లు డబ్బును డ్రా చేసినా కష్టమర్లపై ఎలాంటి చార్జీలు పడలేదు.
కాగా నిన్నటితో ప్రభుత్వం విధించిన గడువు ముగియడంతో జూలై 1 నుంచి అంటే నేటి నుండి ఏటీఎం క్యాష్ విత్డ్రా రూల్స్ మారబోతున్నాయి. ఇకపై క్యాష్ విత్డ్రా రూల్స్ మళ్ళీ అమల్లోకి రానున్నాయి. ఇకపై బ్యాంక్ కస్టమర్లు ఎక్కువసార్లు ఎటిఎంల నుండి విత్డ్రా చేస్తే ఆయా బ్యాంకుల నిబంధనలకు అనుగుణంగా చార్జీలు పడనున్నాయి.
ఎస్బీఐ విషయానికి వస్తే మెట్రో నగరాల్లోని బ్యాంక్ కస్టమర్లు ఎనిమిది ఉచిత ట్రాన్సాక్షన్లు నిర్వహించుకోవచ్చు. వాటిలో 5 ట్రాన్సాక్షన్లు ఎస్బీఐ ఏటీఎంలో మిగిలిన 3 ట్రాన్సాక్షన్లను ఇతర బ్యాంక్ ఏటీఎంలలో నిర్వహించొచ్చు. పట్టణాల్లో అయితే 10 వరకు ఏటీఎం లావాదేవీలు ఉచితం. ఐదు ట్రాన్సాక్షన్లను ఎస్బీఐ ఏటీఎంలో మిగిలిన ఐదు ట్రాన్సాక్షన్లను ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నిర్వహించుకోవచ్చు.
ఆయా బ్యాంకులకు వేరువేరుగా నిబంధనలు ఉండటంతో వాటి గురించి బ్యాంకు కస్టమర్లు తెలుసుకున్న తర్వాత ఎటిఎం లావాదేవీలు నిర్వహించడం ఉత్తమం. లేకుంటే అదనపు చార్జీలు పడటం ఖాయం..