ఆ మధ్య తమన్, దేవిశ్రీ ప్రసాద్ హవాలో తన ఉనికిని మిస్ చేసుకున్న మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ ఫామ్ లోకి రావడం పట్ల సంతోషపడని సంగీత ప్రియుడు లేడు. ఈయనను పక్కన పెట్టినవారంతా ఒక్కొక్కరుగా అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఏకంగా చిరంజీవి, వెంకటేష్ లు తమ ఆచార్య, నారప్పల కోసం తననే కోరిమరీ తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. రెండువేల దశకంలో మణిశర్మ కంపోజ్ చేయని హీరో లేడంటే అతిశయోక్తి కాదు. సీనియర్ జూనియర్ అందరికీ తనే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా నిలిచేవారు. ఇప్పుడు మెల్లగా థర్డ్ జెనరేషన్ స్టార్లు డైరెక్టర్లు కూడా మరోసారి మణిశర్మవైపే మొగ్గు చూపుతున్నారు.
తాజా సమాచారం మేరకు జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాకు మణిశర్మనే దాదాపు ఓకే కావొచ్చని ఫిలిం నగర్ టాక్. ఒకప్పుడు తారక్ మణి కాంబోలో మంచి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఆది, సుబ్బు, సాంబ, నరసింహుడు, అశోక్, కంత్రి లాంటివి చాలానే వచ్చాయి. లాస్ట్ ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సినిమా 2011లో రిలీజైన శక్తి. ఇది భారీ డిజాస్టర్ అయినప్పటికీ పాటలకు మాత్రం మంచి పేరు వచ్చింది. అక్కడితో ఫుల్ స్టాప్ పడింది. ఇంకోసారి సాధ్యపడలేదు. ఆచార్య వర్క్ తో బాగా ఇంప్రెస్ అయిన కొరటాల శివ మణిశర్మ వైపే మొగ్గు చూపుతూ ఆ మేరకు తారక్ కు కూడా చెప్పారట.
అఫీషియల్ గా కన్ఫర్మేషన్ కాలేదు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదో పొలిటికల్ థ్రిల్లర్ గా టాక్ ఉంది. ఆర్ఆర్ఆర్ నుంచి జూనియర్, ఆచార్య నుంచి కొరటాల ఫ్రీ కాగానే ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. స్క్రిప్ట్ ఇప్పటికే రెడీగా ఉందని వినికిడి. అప్పుడెప్పుడో నాగ తర్వాత రాజకీయ నేపధ్యం ఉన్న సినిమా తారక్ చేయలేదు. సందేశం ఉన్నా కమర్షియల్ అంశాలకు లోటు లేకుండా అన్ని వర్గాలను మెప్పించే కొరటాల జనతా గ్యారేజ్ ని మించి ఇందులో యంగ్ టైగర్ ని ప్రెజెంట్ చేయబోతున్నట్టు చెబుతున్నారు. వచ్చే వేసవిలో షూటింగ్ మొదలుపెట్టి వీలైనంత త్వరగానే పూర్తి చేయబోతున్నారు