హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం అధికార టీఆరెస్ కు ఎంత షాక్ ఇచ్చిందో.. కాంగ్రెస్ లో అంతకంటే ఎక్కువ చిచ్చు రగిలించింది. హుజురాబాద్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత హీనస్థితికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దిగజారిపోయింది. గాంధీభవన్ లో బుధవారం జరిగిన ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో తీవ్ర దుమారం రేగింది. ఈ సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి వంటి నేతలు గైర్హాజరు కాగా.. మాజీమంత్రి జానారెడ్డి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఉప ఎన్నికల్లో దారుణ పరాభావానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలే కారణమని పలువురు సీనియర్ నేతలు ధ్వజమెత్తారు. దీనికి ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కావాలనే ఓడిపోయారా..
పార్టీ ఓటమికి రేవంత్ రెడ్డి కారణమని సీనియర్ నేతలు విమర్శిస్తుండగా.. రేవంత్ కూడా బాధ్యత తనదేనని ప్రకటించారు. అయితే హుజూరాబాద్‌లో బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్లే కాంగ్రెసుకు తక్కువ ఓట్లు వచ్చాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాంబ్ పేల్చారు. ఆయన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఫలితాలపై ఆయన స్పందిస్తూ తమ పార్టీ గట్టిగా ప్రయత్నించి ఉంటే ఓట్లు చీలిపోయి టీఆరెస్ గెలిచి ఉండేదన్నారు. దాన్ని అడ్డుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి తగ్గి ఈటల రాజేందర్ కు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను అయోమయంలోకి నెట్టాయి. ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందిస్తూ అందరూ కలిసి బల్మూరి వెంకట్ ను బలి పశువును చేశారన్నారు.
Also Read : By Elections Congress – తెలంగాణలో కన్నా ఆంధ్రాలో కాంగ్రెస్ కు ఎక్కువ ఓట్లు
చరిత్రలోనే దారుణ ఓటమి
హుజురాబాదులో కాంగ్రెసుకు తొలి నుంచీ గెలుపు రికార్డ్ లేదు. 1978 తర్వాత ఆ పార్టీ ఇక్కడ ఒక్కసారి కూడా గెలవలేదు. అయితే 30 శాతం కచ్చితమైన ఓటు బ్యాంకు ఉంది. 2018 ఎన్నికల్లో 60 వేల వరకు ఓట్లు లభించాయి. గెలుపు ఆశలు లేకపోయినా ఈసారి కూడా దాదాపు అదే స్థాయిలో ఓట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ కేవలం 3014 (1.50 శాతం) ఓట్లు దక్కడం పార్టీ కార్యకర్తలను నివ్వెరపరిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెసుకు ఏ ఎన్నికల్లోనూ.. ఏ నియోజకవర్గాల్లోనూ ఇంత తక్కువ ఓట్లు రాలేదు.
రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీలో ఉత్సాహం పెరిగిందన్న వాదన ఉంది. ఆయన సారథ్యంలో జరుగుతున్న తొలి ఉప ఎన్నికలో టీఆరెస్, బీజేపీలకు కాంగ్రెస్ మంచి పోటీ ఇస్తుందని మొదట్లో అందరూ భావించారు. కానీ చివరికి వచ్చేసరికి రెండు ఆబోతుల మధ్య చిక్కుకుని లేగదూడ నలిగిపోయినట్లు కాంగ్రెస్ పరిస్థితి తయారైంది. కాగా అభ్యర్థి ఎంపికలో జాప్యం, కాంగ్రెస్ పోటీలో ఉందన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో వైఫల్యం, టీఆరెస్, బీజేపీలు గ్రామాలను ప్రచారంతో హోరెత్తిస్తుంటే కాంగ్రెస్ నేతలు అటువైపు కన్నెత్తి చూడకపోవడం వంటివి పార్టీ దారుణ ఓటమికి కారణమయ్యాయి. కోమటిరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో కావాలనే ప్రచారంలో వెనక్కి తగ్గారా అన్న అనుమానాలు కొత్తగా రేకెత్తుతున్నాయి.
Also Read : Padi Kaushik Reddy – పాపం కౌశిక్ రెడ్డి.. గెల్లు సేఫ్, ఈటెల సేఫ్.. అటూ ఇటూ కాకుండా అయ్యాడే?