వాయుగుండం ప్రభావంతో కురిసిన కుంభవృష్టి రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. అపార నష్టం కలిగించింది. పదుల సంఖ్యలో ప్రజలు, వేల సంఖ్యలో పశువులను వర్షాలు కబళించాయి. డ్యాములు, చెరువులు, కాలువల కట్టలు తెగి వరద నీరు పల్లెలపై దాడి చేసి విధ్వంసం సృష్టించింది. లక్షలాది ఎకరాల్లో ఆహార, ఉద్యానవన పంటలు నాశనం అయ్యాయి. విద్యుత్, నీటిపారుదల, రైల్, రోడ్డు రవాణా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలకు నష్టం వాటిల్లింది. వేలసంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించి యుద్ధప్రాతిపదికన సహాయ పునరావాస చర్యలు చేపట్టింది. సీఎం జగన్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే జరిపి.. బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉండాలని ఆదేశించారు.
నష్టాల ప్రాథమిక అంచనాలు
భారీ వర్షాలకు నెల్లూరుతో పాటు కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని స్వర్ణముఖి, పెన్నా, చెయ్యేరు, పాపాఘ్ని నదులు, బుగ్గవంక వాగు, వరద నీటితో ఉప్పొంగాయి. అన్నమయ్య డ్యామ్ కట్ట తెగడం, సోమశిల, పింఛ ప్రాజెక్టులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తూ తీర గ్రామాలు, పట్టణాలను ముంపునకు గురిచేశాయి. ప్రాథమిక అంచనా ప్రకారమే వందల కోట్లలో పంట, ఆస్తి నష్టం వాటిల్లింది.
-వర్షాలు, వరదల్లో ఇప్పటివరకు 13 మంది మృతి చెందగా.. మరో 17 మంది గల్లంతు అయ్యారు.
-నాలుగు జిల్లాల్లోని 172 మండలాలు, 4 పట్టణాలు వరద ప్రభావానికి గురయ్యాయి.
-1316 గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి.
-1549 ఇళ్లు కూలిపోగా.. 488 ఇళ్లు ముంపునకు గురయ్యాయి.
-సుమారు 2.33 లక్షల హెక్టార్లలో ఆహార పంటలు నాశనం అయ్యాయి.
-మరో 19,644 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి.
-కడప జిల్లా కమలాపురం-వల్లూరు మధ్య పాపాఘ్ని నదిపై వంతెన కుంగిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
-187.78 కి.మీ. మేర పంచాయతీరాజ్ రోడ్లు ధ్వంసం అయ్యాయి.
-3370 పశువులు మృత్యువాత పడ్డాయి.
కడప జిల్లా నందలూరు సెక్షన్లో కిలోమీటర్ మేర రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో రూ.15 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
-చెయ్యేరు వరద ముంచెత్తడంతో కడప జిల్లా రాజంపేట, నందలూరు, పెనగళూరు మండలాల్లో 17 గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
సర్కారు అపన్నహస్తం
వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన కడప, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయ పునరావాస చర్యలు చేపట్టింది. గత మూడు రోజులుగా ముఖ్యమంత్రి జగన్ వరద సహాయ చర్యలపై నిరంతరం అధికారులతో సమీక్షిస్తున్నారు. శనివారం వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి స్వయంగా పరిశీలించారు.
-మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు.
-ముంపునకు గురైన ప్రతి ఇంటికి తక్షణ సాయంగా వెయ్యి రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు.
-కడప జిల్లాలో చెయ్యేరు వరద బాధిత కుటుంబాలకు రూ.2 వేలు చొప్పున తక్షణ సాయం ప్రకటించారు.
-వరద బాధిత ప్రాంతాల్లో, సహాయ శిబిరాల్లో ఉన్నవారికి నిత్యావసర వస్తువులు, ఆహారం ఉచితంగా అందించాలన్నారు.
-శాఖల వారీగా సమగ్రంగా నష్టం అంచనాలు వేయాలని ఉన్నతాధికారులకు సూచించారు.