నవంబర్ 19 అంతర్జాతీయ పురుషుల దినోత్సవమట! అయినా మగాళ్లకి. ఆడాళ్లకే కాదు, ప్రపంచానికే రోజులు బాలేని కాలం ఒకటొచ్చింది. ప్రతి కుక్కకీ ఒకరోజు వస్తుందంటారు. కుక్క సంగతి తెలీదు కానీ, కరోనాకి మాత్రం వచ్చింది. ఇవి కరోనా రోజులు.
అయినా పత్రికలు కూడా స్త్రీ పక్షపాతులు. మహిళా దినోత్సవానికి పేజీల కొద్దీ కథనాలు రాస్తారు. అదే పురుషుల రోజు వస్తే సింగిల్ కాలమ్ లేదు. మగవాళ్లంతా సన్నాసులని నేను చిన్నప్పుడే కనిపెట్టాను. మా వూళ్లో 60 దాటిన మగవాళ్లలో చాలా మంది సన్నాసుల్లో కలిసిపోవడమే దీనికి కారణం. కాశీకి పోయినోళ్లు కాశీకి, కాటికి పోయినోళ్లు కాటికి.
పురుషుడు అని ఎందుకంటారంటే వాడు ఎప్పటికైనా రుషికాక తప్పదని. సామెతలు, సినిమా డైలాగ్‌లు ఎక్కువగా రాసేది మగవాళ్లే కాబట్టి తమ ఇగోని చల్లబరుచుకోడానికే ఏదేదో రాస్తుంటారు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా, అసలు పురుషుడుగా జీవించడమే కష్టంగా వుంటే పుణ్యపురుషుడు అంటే ఎవడ్రా బాబు.
పుణ్యం కొద్దీ పురుషుడు అని ఇంకో సామెత. ఆడాళ్లు పుణ్యం చేస్తే మంచి మొగుడు దొరుకుతాడట. పుణ్యమైనా పాపమైనా దొరికేది మొగుడు. మంచి మొగుడు ఇంకా పుట్టలేదు. మగాళ్లంతా చవటలేనని మెజార్టీ మహిళల అభిప్రాయం. దీనికి పెళ్లయితే చాలు, సర్వే అక్కర్లేదు.
ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. ఇపుడు కరోనా వల్ల ఉద్యోగం వూడిపోవడం పురుష లక్షణంగా మారింది. మగాడివైతే రా, ఆడు మగాడ్రా బుజ్జీ , ఇక్కడెవరూ గాజులు తొడుక్కుని లేరు ఇలాంటి డైలాగ్‌లకు కాలం చెల్లిపోయిందని కరోనా టైంలో అర్థమై వుంటుంది.
ఈ మధ్య అమెరికా వస్తే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జాక్సన్విల్లి వరకూ మా ఆవిడ నన్ను మేకని లాక్కొచ్చినట్టు లాక్కొచ్చింది.
నాకు ఇంగ్లీష్ వచ్చు, ఆమెకి రాదు అనే అహంకారం వుండేది నాలో. మనకి ఇంగ్లీష్ వస్తుందా, రాదా అనేది పాయింట్ కాదు. సమయం వచ్చినపుడు మాట్లాడగలమా లేదా?
నాకు అమెరికన్ యాక్సెంట్ అర్థంకాక “బేబ్బే” అన్నాను. ఆమె అతని యాక్సెంట్‌ని పట్టించుకోకుండా తాను చెప్పదలచుకున్నది ఇండియన్ రాయలసీమ శైలిలో దడదడ చెప్పేసింది.
అది వాడికి అర్థంకాక ఇమ్మిగ్రేషన్ నుంచి వదిలేశాడు. నా మగ అహంకారం తునకలైపోయి అమెరికా రోడ్లని ఆశ్చర్యంగా చూస్తూ గడిపేస్తున్నా. ఏదైనా సాధించేవాళ్లకి దినోత్సవం. ఆడవాళ్లు బాగా సాధిస్తారు కాబట్టి మహిళా దినోత్సవానికి విలువ ఎక్కవ.
నా చిన్నతనానికి , ఇప్పటికీ 50 ఏళ్ల కాలంలో ఎన్నో మారిపోయాయి. రాయదుర్గంలో ఒకాయన 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అప్పట్లో అది తప్పని ఎవరికీ అనిపించలేదు. ఇపుడైతే జైల్లో వేస్తారు. అయినా పెళ్లే ఒక జైలయినపుడు 3 జైళ్లు ఎందుకు అమాయకత్వం కాకపోతే.
మగపిల్లలకి ప్రత్యేకమైన హక్కులున్నాయనుకునే కాలం నుంచి ఆడపిల్లలుంటే అద్భుతమనే వరకూ వచ్చాం. అయినా ఇంకా అనాగరిక అవలక్షణాల నుంచి ఇంకా సొసైటీ బయటపడలేదు. డైనోసార్లు అంతరిస్తున్న అవశేషాలు మిగిలిపోతున్నాయి.