ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ 71వ ఏడాదిలోకి ప్రవేశించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే 1950 సెప్టెంబర్ 17న ఉత్తర గుజరాత్ లోని మోహసానా జిల్లాలోని వాదానగర్ లో జన్మించారు. ఒకప్పడు వాదానగర్ లో బౌద్ధమతం విరాజిల్లినట్లు చారిత్రిక ఆధారాలు లభించాయి.
కష్టాల బాల్యం…
ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ నేతగా ఉన్న మోదీకి, బాల్యం మాత్రం చేదు పాఠాలే నేర్పింది. కుటుంబ జీవనం కోసం వారికి గల టీ దుకాణంలో పనిచేశారు మోదీ. చిన్నప్పటి నుంచి ఆయనకు చర్చలు అంటే ఇష్టం. అలాగే ఈతను కూడా మోదీ ఇష్టపడేవారు. 17 ఏళ్ల వయస్సులో ఇల్లు విడిచి వెళ్లిన మోదీ.. రెండేళ్ల పాటు దేశం వ్యాప్తంగా పర్యటించారు. సంస్కృతులు,ఆచారాలు గమనించారు. తర్వాత ఇంటికి వచ్చి ఆర్ఎస్ఎస్ లో చేరారు. 1972లో ప్రచారక్ గా బాధ్యతలు చేపట్టారు. 15 ఏళ్ల పాటు RSSలో పలు పదవుల్లో పనిచేశారు. 1987 గుజరాత్ బీజేపీ ప్రధానకార్యదర్శి పదవి చేపట్టి.. అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి బాటలు వేశారు. 1990లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 121 సీట్లు సాధించి రెండోస్థానంలో నిలవడంలో మోదీ కీలకపాత్ర పోషించారు. 1995 లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా ప్రమోషన్ పొందిన మోదీ.. హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 1998 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయంలో మోదీ పాత్ర కీలకమైనది.
గుజరాత్ సీఎంగా..
2001లో గుజరాత్ సీఎం కేశూభాయ్ పటేల్ అనారోగ్యానికి గురికావడంతో ఆయనపై అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ అగ్రనేతలు వాజ్ పేయ్, ఎల్కే అద్వానీ, గుజరాత్ సీఎంగా మోదీని ఎంపిక చేశారు. గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత 2002 ఫిబ్రవరి లో రాజ్ కోట్ -2 నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు. అదే ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చింది. 2007, 2012లోనూ మోదీ నేతృత్వంలోని బీజేపీ ని గెలిపించి అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా ఎదిగారు. 2012లో మణి నగర్ నుంచి మోదీ విజయం సాధించారు. 2014 మే 22 వరకు సీఎంగా పనిచేశారు. అంటే 12 సంవత్సరాల 227 రోజులు సీఎంగా సేవలు అందించారు.
భారత ప్రధానిగా….
2014 మే 26న భారత ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. అంటే మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఇవాళిటికి 7 సంవత్సరాల 2 నెలల 2 రోజులు అవుతుంది. జవహర్ లాల్ నెహ్రూ 16 సంవత్సరాల 286 రోజులు పాటు దేశ ప్రధానిగా సేవలందించగా ఆయన కుమార్తె ఇందిరా గాంధీ 15 సంవత్సరాల 350 రోజుల పాట పీఎంగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల 4 రోజులు పీఎంగా బాధ్యతలు నిర్వహించారు. అయితే నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్ లు సీఎంగా పనిచేయలేదు. జ్యోతిబసు(వెస్ట్ బెంగాల్), పవన్ కుమార్ చామ్లంగ్(సిక్కిం) లు ఎక్కువ కాలం పాటు సీఎంగా ఉన్నప్పటికీ పీఎం కాలేకపోయారు. ఒక్క మోదీకి మాత్రమే ఈ ఘనత దక్కింది.
Also Read : నేడు జీఎస్టీ మండలి భేటీ : పెట్రోలు, డీజిల్ పై కీలక నిర్ణయం?