ప్రతి ఏటా దసరా సందర్భంగా బెంగాల్ ప్రజలు దుర్గాదేవి పూజను వైభవంగా నిర్వహిస్తారు. వీధుల్లో మండపాలు నిర్మించి, పెద్ద పెద్ద విగ్రహాలతో, తొమ్మిది రోజుల పాటు వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, పదవరోజున ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. అయితే మూడు శతాబ్ధాల ముందు వరకూ ఈ కార్యక్రమం కేవలం ధనవంతులు, జమీందార్లకు మాత్రమే పరిమితమైన వ్యవహారంగా ఉండేది. సామాన్యులకు ఇందులో చోటు ఉండేది కాదు.
చరిత్రలో దుర్గపూజ
బెంగాల్ లో క్రీస్తుశకం ఆరవ శతాబ్దం నుంచే దుర్గపూజ జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. బెంగాల్ మహారాజు సూరత్ కొందరు యోగుల సలహా మేరకు దుర్గాదేవిని పూజించి కోల్పోయిన తన రాజ్యాన్ని తిరిగి పొందినట్టు పురాణాల్లో ఉంది. పదిహేనవ శతాబ్దంలో కృత్తివాస భోజుడు బెంగాలీ భాషలో రచించిన రామాయణంలో రాముడు అమ్మవారిని పూజించి రావణ సంహారం చేసినట్లు రచించడంతో అమ్మవారి పూజలు మరింత ఎక్కువగా జరగడం మొదలయింది. అయితే ఇప్పుడు జరుగుతున్నట్లు అంగరంగ వైభవంగా పూజలు జరగడం బ్రిటిష్ వారి కాలంలో మొదలైంది.
1757వ సంవత్సరంలో ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా మీద విజయం సాధించిన బ్రిటిష్ అధికారి రాబర్ట్ క్లైవ్ ఆ విజయాన్ని పురస్కరించుకుని వేడుకలు భగవంతుడికి ధన్యవాదాలు తెలిపి, వేడుకలు జరుపుకోవడానికి ఒక్క చర్చ్ కూడా లేకుండా కలకత్తాలోని బ్రిటిష్ ఆవాసం ఫోర్ట్ విలియంలో ఉన్న చర్చలు అన్నీ నేలమట్టం చేశాడు అంతకుముందు సిరాజుద్దౌలా. అప్పుడు బ్రిటిష్ వారి వద్ద మున్షీగా, దుబాసీగా పనిచేస్తున్న నవకృష్ణ దేవ్ అనే ఉద్యోగి పెద్ద మండపం నిర్మించి, అందులో దుర్గాదేవి విగ్రహం పెట్టి పూజలు, సంగీత, నాట్య కార్యక్రమాలు, విందు వినోదాలతో బ్రిటిష్ వారిని అలరించాడు. ఇందుగ్గానూ అతనికి రాజా అనే బిరుదు, కొన్ని గ్రామాలమీద జమీ హక్కులు ఇచ్చారు బ్రిటిష్ వారు. దీన్ని చూసి ఆ తరువాత సంవత్సరాలలో మరికొంత మంది జమీందారులు, సంపన్నులు ఇదే విధంగా దుర్గపూజలు నిర్వహించినా అవి కేవలం బ్రిటిష్ అధికారులు, తమ బంధువులూ, మిత్రులకూ మాత్రమే పరిమితం అయి ఉండేవి. సామాన్యులకు ప్రవేశం ఉండేది కాదు.
కొత్త ఒరవడి ప్రవేశపెట్టిన బారో యారి
1790 సంవత్సరంలో హుగ్లీ సమీపంలో ఉన్న గుప్తిపుర గ్రామంలో జరిగిన ఒక సంఘటన బెంగాల్ రాష్ట్రంలో దుర్గపూజ తీరుతెన్నులు పూర్తిగా మార్చివేసింది. ఆ గ్రామంలో ఉన్న జమీందారు నిర్వహిస్తున్న పూజా కార్యక్రమంలో అమ్మవారిని ప్రార్ధించి ఆశీస్సులు తీసుకోవాలని వచ్చిన కొందరు బ్రాహ్మణ యువకులను నిర్వాహకులు అనుమతించలేదు. ఇది అవమానంగా భావించిన వారు తాము స్వయంగా దుర్గపూజ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇది బాగా కర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో పన్నెండు మంది కమిటీగా ఏర్పడి, విరాళాలు సేకరించి అప్పటికప్పుడు మండపం, ప్రతిమ, పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో కులమతాలకతీతంగా అందరికీ భాగస్వామ్యం కల్పించడంలో గుప్తిపుర గురించి బెంగాల్ మొత్తం తెలిసిపోయింది. ఆ మరుసటి సంవత్సరం ఇదే విధానంలో బెంగాల్ అంతటా పూజా మండపాలు వెలిశాయి. ఈ పద్ధతి ప్రారంభించిన పన్నెండు మంది యువకుల పేరిట దీనికి బారోయారి (పన్నెండు మిత్రులు) పూజ అన్న పేరు ఏర్పడింది. అదే నేటికి ఉన్న బారోవారి పూజ.
మహిషాసుర మర్ధనిగా అమ్మవారి విగ్రహాలు పెట్టినా, మిగిలిన చోట్ల ఉన్నట్టుగా బెంగాల్ మహిషాసుర మర్ధని మొహంలో ఆవేశం, నిప్పులు కక్కుతున్న కళ్ళు ఉండవు. పండగపూట పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డ లాగా ప్రశాంతమైన రూపం ఉంటుంది. ఈ సంవత్సరం కరోనా మూలంగా దుర్గపూజలో ఉత్సాహం తగ్గినా, వచ్చే దసరా నాటికి అమ్మవారు కరోనాని అంతం చేసి, అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిపించుకుంటారని భక్తులందరీ ఆకాంక్ష.