మంటలు పుట్టించే తీవ్రమైన వడగాడ్పులు.. వాటి పర్యవసానంగా చెలరేగుతున్న కార్చిచ్చు గ్రీస్, దాన్ని ఆనుకొని ఉన్న టర్కీలోని పలు ప్రాంతాలను దహించేస్తున్నాయి. గత రెండు వారాలుగా గ్రీస్ రాజధాని ఏథెన్స్ కు ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో పలుచోట్ల కార్చిచ్చు రగులుకొని మిగిలిన ప్రాంతాలకు శరవేగంగా వ్యాపిస్తోంది. దీని నుంచి తప్పించుకునేందుకు గ్రామాలు, పట్టణాలను ఖాళీ చేసి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇప్పటికే గ్రీస్ లో ముగ్గురిని, టర్కీలో ఎనిమిది మందిని కార్చిచ్చు బలి తీసుకుంది. వందల కోట్ల విలువైన ఆస్తులు, ఇళ్లు, వాహనాలు, జంతువులు ఆహుతి అవుతున్నాయి. సుమారు లక్ష హెక్టార్లలో పంట భూములు, అడవులు అగ్నికీలల్లో మాడి మాసి అయ్యాయి. రాజధాని ప్రాంతమైన గ్రేటర్ ఏథెన్స్ సమీపంలోని పారిశ్రామిక ప్రాంతాన్ని కూడా మంటలు కమ్ముకుంటున్నాయి. వర్షాల కారణంగా టర్కీలో అగ్ని కీలలు కొంత శాంతించినా.. గ్రీసులో మాత్రం వాటిని అదుపు చేయడం సాధ్యం కావడంలేదు. కార్చిచ్చు కట్టడి, సహాయ చర్యల్లో గ్రీసుకు సహాయపడేందుకు పలు దేశాలు రంగంలోకి దిగాయి.
3 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వేడి
గ్రీసులో గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వేడి వాతావరణం నెలకొంది. అతి తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి. ఇవే కార్చిచ్చును రగిలించాయి. మొదట రాజధాని ఏథెన్స్ సమీపంలో ఉత్తరంగా ఉన్న ఒక దీవిలోని పర్వత సానువుల్లో రేగిన కార్చిచ్చుకు గాలులు తోడు కావడంతో శరవేగంగా ఇతర ప్రాంతాలకు విస్తరించడం మొదలెట్టింది. ఉత్తర తీరంలోని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు.. అక్కడి నుంచి పశ్చిమానికి అగ్నికీలలు వ్యాపించాయి. ఇవియా, పెలోపోనిసి, ఆర్కాడియా, ప్రాచీన ఒలింపిక్స్ ప్రారంభ వేదిక అయిన ఒలింపియా, అయోనియన్ ద్వీపంలోని జాకింతోష్ ప్రాంతాలు అగ్ని జ్వాలాల్లో చిక్కున్నాయి. ఇళ్లు, పంటలు, వ్యాపారాలు, జంతువులు, ఇతర ఆస్తులను విడిచి వేలాది మంది ప్రజలు ప్రాణభయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. తమ ఆస్తులన్నింటినీ కార్చిచ్చు స్వాహా చేసి అనాథలను చేసిందని బాధితులు వాపోతున్నారు. పెద్ద సంఖ్యలో గ్రామాలు, పట్టణాలు కాలి బూడిద అయ్యాయి. గ్రేటర్ ఏథెన్స్ కూ గురువారం మంటలు వ్యాపించాయి. 150 గృహాలు కాలిపోయాయి. అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పారిశ్రామిక వాడను సైతం చుట్టుముట్టాయి. మరోవైపు ఇవియా, ఆర్కాడియా ద్వీపాలో అగ్నికీలలు ఇంకా విజృంభిస్తూనే ఉన్నాయని అగ్నిమాపక దళ అధికారి ఒకరు తెలిపారు.
అగ్ని కీలలతో అలుపెరుగని పోరాటం
రోజుల తరబడి విజృంభిస్తున్న కార్చిచ్చును అదుపు చేసేందుకు అగ్నిమాపక దళాలు రాత్రింబవళ్లు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాయి. సుమారు 1450 మంది ఫైర్ ఫైటర్లు, 17 అగ్నిమాపక విమానాలు, హెలికాఫ్టర్లు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. అయినా మంటలు మరింత విజృంభిస్తున్నాయే తప్ప అదుపులోకి రావడం లేదు. వేడి గాలులకు ఈ మంటల వేడి కూడా తోడు కావడంతో ఆ ప్రాంతాల్లో 113 ఫారన్ హీట్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది ఊహకు అందని విషాదమని.. అపార నష్టం వాటిల్లిందని గ్రీస్ ప్రధాన మంత్రి క్రియకోస్ మిట్సోటకిస్ వ్యాఖ్యానించారు. ఈ మహా విపత్తులో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ప్రాధాన్యమిస్తున్నామని ఆయన చెప్పారు. 2007 తర్వాత కార్చిచ్చు ఇంత తీవ్రంగా కమ్ముకోవడం ఇదే మొదటిసారి అని చెప్పారు. మెడిటరేనియన్ రీజియన్ లో వాతావరణ మార్పులే ఈ ఉత్పాతానికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా కార్చిచ్చు మంటల్లో చిక్కుకున్న గ్రీస్ ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొస్తోంది. ఫ్రాన్స్, బ్రిటన్, ఈజిప్టు, స్పెయిన్, జర్మనీ, సైప్రెస్, ఇజ్రాయెల్ దేశాలు ఇప్పటికే స్పందించి తమ దేశాల నుంచి ఫైర్ ఫైటర్లను, సహాయ సామగ్రిని పంపాయి.
Also Read : ఆఫ్ఘనిస్థాన్ మీద పట్టు బిగిస్తున్న తాలిబన్లు