ఇంకా అఖండ షూటింగ్ పూర్తి కాకుండానే బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే సినిమా తాలూకు పనులు వేగమందుకుంటున్నాయి. లాక్ డౌన్ కాగానే అటు బోయపాటి శీను గుమ్మడి కాయ కొట్టడం ఆలస్యం వేసవి అయిపోయే లోపు దీన్ని స్టార్ట్ చేసే విధంగా మైత్రి మూవీ మేకర్స్ పక్కా ప్లానింగ్ తో ఉంది. ముందునుంచి ప్రచారంలో ఉన్నట్టు శృతి హాసన్, త్రిషలు కాకుండా వేరే భామలను బాలయ్య కోసం రంగంలోకి దించబోతున్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుంది. తమన్ ఇప్పటికే కంపోజింగ్ పనులు మొదలుపెట్టినట్టు సమాచారం. ఒకటి రెండు ట్యూన్లు ఓకే కూడా అయ్యాయట.
తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ ని లాక్ చేసినట్టు వచ్చిన వార్త అభిమానులను ఆనందానికి గురి చేస్తోంది. క్రాక్ లో తన పెర్ఫార్మన్స్ ఏ స్థాయిలో పేలిందో చూసాం. అందుకే దాన్ని మించిన స్థాయిలో ఫ్యాక్షన్ ఛాయల్లో చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ ని గోపీచంద్ మలినేని డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. అంతే కాదు ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్, డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రాతో సహా అధిక శాతం క్రాక్ టీమే దీనికి వర్క్ చేయనుండటం విశేషం. బాలయ్యను చాలా గ్యాప్ తర్వాత శక్తివంతమైన ఫ్యాక్షన్ లీడర్ గా ఇందులో చూపించబోతున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. దీని కోసం మలినేని కొన్ని నిజ జీవిత సంఘటనలు కూడా స్ఫూర్తిగా తీసుకున్నాడు.
ఇది ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలు లేవు. వచ్చే సమ్మర్ ని టార్గెట్ చేస్తున్నారు. అఖండ ఒకవేళ ఆగస్ట్ లో వచ్చే అవకాశం ఉంటే కొంత ఎక్కువ గ్యాప్ దొరుకుతుంది. బడ్జెట్ దృష్ట్యా పెద్ద సినిమాలు ఏవీ వేగంగా పూర్తి చేసే పరిస్థితులు లేకపోవడంతో రిలీజ్ గురించి ఒక అవగాహనకు రావడం కష్టంగా మారింది. అఖండ, గోపిచంద్ సినిమాలు అయ్యాక అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయబోతున్న బాలయ్య మొత్తానికి ఫ్యాన్స్ ఆకాంక్షలకు తగ్గట్టు ఇప్పటి జెనరేషన్ దర్శకులతో చేయడం హర్షించదగ్గ విషయమే. ఈ నెలాఖరు నుంచి అఖండ లిరికల్ వీడియోస్ ని విడుదల చేసే ప్లాన్ లో ఉంది బోయపాటి టీమ్.