కరోనా వైరస్ ప్రపంచంలోకి అడుగుపెట్టి ఏడు నెలలు దాటిపోయింది. కరోనా కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ప్రఖ్యాత కంపెనీలు తమ వద్ద పనిచేసే ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గించుకునేందుకు తగిన ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులను తొలగించాయి కూడా. కానీ ఒక ప్రఖ్యాత కంపెనీ మాత్రం తమ వద్ద పనిచేసే ఉద్యోగులపై పనిభారం ఎక్కువగా పడకుండా ఉండేందుకు వారంలో మూడు రోజులు వీక్ ఆఫ్ గా ప్రకటించింది. ఈ సమయంలో కూడా ఉద్యోగుల కోసం వీక్ ఆఫ్ ప్రకటించిన కంపెనీ ఏది అనే కదా మీ డౌట్.. ఆ కంపెనీ మరేదో కాదు ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ గూగుల్..
గూగుల్ కంపెనీలో పనిచేసేవారికి శని,ఆది వారాలు వీక్ ఆఫ్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం కూడా వీక్ ఆఫ్ గా ప్రకటించి గూగుల్ షాక్ ఇచ్చింది. ఈ అదనపు వీకాఫ్ ఫుల్ టైమ్ ఉద్యోగులతోపాటూ పార్ట్‌టైమ్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని కంపెనీ ప్రకటనలో తెలిపింది. గూగుల్ తాజా ప్రకటనతో ఉద్యోగులు ఇకపై వారానికి 4 రోజులు మాత్రమే పని చేస్తారు.
కరోనా విలయతాండవం చేస్తుండడంతో గూగుల్ కంపెనీ తమ ఉద్యోగులకు 2021 చివరి వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని గూగుల్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఉద్యోగులపై ఒత్తిడిని తగ్గించేందుకు ఒక అదనపు వీక్ ఆఫ్ ను ప్రకటిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. ఒకవేళ ఎవరైనా శుక్రవారంనాడు పనిచేస్తే తమకు నచ్చిన రోజున వీక్ ఆఫ్ తీసుకోవచ్చని గూగుల్ వెల్లడించింది. ఇకపై వారంలో కేవలం నాలుగు రోజులు మాత్రమే పనిచేసే వెసులుబాటు కంపెనీ కల్పించడంతో గూగుల్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..